ప్రాణం తీసిన మూఢత్వం

Jan 26,2024 11:16 #Superstitions, #Uttarakhand
boy death by superstition in uttarakhand
  • కేన్సర్‌తో బాధపడుతున్న ఐదేళ్ల బాలుడి మృతి 
  • గంగలో ముంచడంతో ప్రాణాలు బలి

డెహ్రాడూన్‌ : దేశాన్ని మూఢత్వం, అంధ విశ్వాసాలు ఏదో రూపంలో పట్టిపీడుస్తూనేవున్నాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మూఢత్వ భావనలకు పాలకులు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో అమాయక ప్రజలు అంధ విశ్వాసాలకు బలైపోతున్నారు. ఉత్తరాఖండ్‌లో ఇలాంటి మూఢత్వాన్నే విశ్వసించి కేన్సర్‌తో బాధపడుతున్న సొంత బిడ్డను తల్లిదండ్రులు బలిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఓ ఐదేళ్ల బాలుడు బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. అక్కడే ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బిడ్డ త్వరగా కోలుకోవాలని ఆశించిన తల్లిదండ్రులు ఎంతోమంది వైద్యులను, జ్యోతిష్యులను, మత గురువులను సంప్రదించారు. ఈ క్రమంలో హరిద్వార్‌ వెళ్లి పవిత్ర గంగలో బిడ్డను ముంచితే కేన్సర్‌ మాయం అవుతుందని ఓ పండితుడు సలహా ఇచ్చాడు. దీంతో తమ బిడ్డను కాపాడుకునేందుకు హరిద్వార్‌లోని హర్‌కీ పౌరికి తీసుకువెళ్లి ప్రార్థనలు చేశారు. చిన్నారిని అతడి అత్త చల్లగా ఉన్న నది నీటిలో ముంచింది. ఇదంతా అక్కడున్నవారు గమనించారు. ఎంతకీ బాలుడిని బయటకు తీయకపోవడంతో ఆమెను అడ్డుకున్నారు. ఇలా చేస్తే బిడ్డ బతుకుతాడంటూ ఆమె వారిపై దాడికి యత్నించింది. స్థానికులు ఆమెను అడ్డుకొని బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

➡️