రెండూ ఎదురు దెబ్బలే !

Jan 14,2024 10:52 #increased, #inflation
  • తగ్గిన పారిశ్రామిక ఉత్పత్తి
  • పెరిగిన ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థకు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. గత సంవత్సరం నవంబరులో దేశ పారిశ్రామికాభివృద్ధి ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయి 2.4%కి చేరింది. అక్టోబరులో 16 నెలల గరిష్ట స్థాయికి…అంటే 11.6%కి చేరిన పారిశ్రామికాభివృద్ధి ఒక్కసారిగా పడిపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇక ద్రవ్యోల్బణం గత డిసెంబరులో నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరి 5.69%గా నమోదైంది. ఉత్పాదక రంగం పనితీరు అధ్వాన్నంగా ఉండడమే పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణం. గత నవంబరులో ఈ రంగంలో 1.2% వృద్ధి మాత్రమే నమోదైంది. అంతకుముందు ఏడు నెలల కాలంలో నమోదైన వృద్ధితో పోలిస్తే ఇది బాగా తక్కువ. అదే నెలలో వినియోగ వస్తువుల ఉత్పత్తి 5.4% తగ్గిపోయింది. కోవిడ్‌ మహమ్మారి రెండోసారి విరుచుకుపడిన 2021 జూన్‌ తర్వాత వినియోగ వస్తువుల ఉత్పత్తి ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి. అదే విధంగా నవంబరులో విద్యుదుత్పత్తి కూడా బాగా తగ్గింది. గత సంవత్సరం ఫిబ్రవరి తర్వాత విద్యుదుత్పత్తి ఇంతగా తగ్గడం కూడా ఇదే మొదటిసారి. అయితే గత అక్టోబరులో విద్యుదుత్పత్తిలో 20.4% వృద్ధి నమోదు కావడం విశేషం. ఉత్పాదక రంగంలో మొత్తం 23 విభాగాలు ఉండగా వాటిలో ఆరు మాత్రమే నవంబరులో వృద్ధిని నమోదు చేశాయి. వృద్ధి నమోదు చేసిన విభాగాలలో కోక్‌, రిఫైన్డ్‌ పెట్రోలియం ఉత్పత్తులు (14.2%), ఇతర రవాణా పరికరాలు (9.8%), మోటారు వాహనాలు (9.2%) ఉన్నాయి.

పెరుగుతున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం

గత సంవత్సరం డిసెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం అధికంగానే ఉన్నప్పటికీ రిజర్వ్‌బ్యాంక్‌ నిర్దేశించిన 6% గరిష్ట పరిమితిలోనే ఉంది. సెప్టెంబర్‌ నుండి డిసెంబర్‌ వరకూ రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ పరిమితిలోనే ఉండడం కొంత ఊరట కలిగించే విషయం. ఆహారధాన్యాలు, కూరగాయల ధరలు తగ్గినప్పటికీ ఆహార వస్తువుల ధరల్లో పెరుగుదలే రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమైంది. మొత్తంమీద ఆహార ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నవంబరులో 8.70%గా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం డిసెంబరు నాటికి 9.53%కి పెరిగింది.

9 రాష్ట్రాలలో అధిక ద్రవ్యోల్బణం

జాతీయ సగటుతో పోలిస్తే గత డిసెంబరులో తొమ్మిది రాష్ట్రాలలో అధిక ద్రవ్యోల్బణ రేటు నమోదైంది. 2022తో పోలిస్తే భారతీయుల సగటు జీవన వ్యయం (ద్రవ్యోల్బణం) 5.69% పెరిగింది. ఒడిషాలో 8.73%, గుజరాత్‌లో 7.07%, రాజస్థాన్‌లో 6.95% పెరిగింది. హర్యానా, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్‌, బీహార్‌ రాష్ట్రాలు కూడా జాతీయ సగటు కంటే అధిక ద్రవ్యోల్బణ రేటును నమోదు చేసుకున్నాయి. ఈ రాష్ట్రాలలో ద్రవ్యోల్బణ రేటు 5.89% నుండి 6.72% వరకూ నమోదైంది. రాష్ట్రాల వారీగా చూస్తే హర్యానాలో 6.72%, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో 6.65%, మహారాష్ట్రలో 6.08%, పంజాబ్‌లో 5.95%, బీహార్‌లో 5.89% ద్రవ్యోల్బణ రేటు నమోదైంది. మార్కెట్‌ పరంగా భారత్‌కు సన్నిహితంగా ఉండే పలు దేశాలలో కూడా ద్రవ్యోల్బణం 4% కంటే అధికంగానే ఉంది. బ్రెజిల్‌, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. రష్యాలో 7.5%, దక్షిణాఫ్రికాలో 5.5%, బ్రెజిల్‌లో 4.62% ద్రవ్యోల్బణం నమోదైంది. చైనాలో ధరలు తగ్గడంతో అక్కడ ద్రవ్యోల్బణ రేటు -0.3%గా ఉండడం గమనార్హం. అభివృద్ధి చెందిన దేశాలలో ఫ్రాన్స్‌ 4% కంటే ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసింది.

➡️