సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యపరచాలి 

Jan 3,2024 10:44 #Vijayawada Book Festival
book festival

 

ప్రజాశక్తి సాహితీ సంస్థ పూర్వ జనరల్‌ మేనేజర్‌ వి.కృష్ణయ్య

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : సమాజంలో జరుగుతున్న మార్పులను విశ్లేషిస్తూ మంచి సాహిత్యాన్ని అందించడం ద్వారా ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత రచయితలపై ఉందని ప్రజాశక్తి సాహితీ సంస్థ పూర్వ జనరల్‌ మేనేజర్‌ వి.కృష్ణయ్య అన్నారు. విజయవాడలో జరుగుతున్న 34వ పుస్తకమహోత్సవంలో కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై గనారా రచించి, సాహితీ స్రవంతి ప్రచురించిన ‘జీవన స్పర్శ’ నవలను కృష్ణయ్య మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్య తరగతి కుటుంబ ఘర్షణ, జీవన పోరాటాన్ని విపులంగా గనారా రాశారని అన్నారు. వామపక్ష ఉద్యమాలు, బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలు వంటి అంశాల గురించి విస్తృతంగా చర్చించారని తెలిపారు. రచయిత్రి, ప్రజాశక్తి బుకహేౌస్‌ పూర్వ సంపాదకులు కె.ఉషారాణి.. ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ ప్రేమకథ నేపథ్యంలో సామాజిక మార్పులను, సంఘర్షణలను చక్కగా చిత్రీకరించారని వివరించారు. ఆధునిక జీవితంలో సాహిత్యానికి స్థానం తగ్గిపోవడం విచారకరమని సభకు అధ్యక్షత వహించిన వొరప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. సాహిత్య ప్రస్థానం వర్కింగ్‌ ఎడిటర్‌ సత్యాజీ మాట్లాడుతూ.. ఒక మనిషి వ్యక్తిగత, ఉద్యోగ, సామాజిక జీవితానికీ మధ్య జరిగే సంఘర్షణను రచయిత హృద్యంగా చిత్రీకరించారని తెలిపారు. రచయిత గానారా మాట్లాడుతూ.. తాను మధ్య తరగతి వ్యక్తినని, చిన్నప్పటి నుండి మధ్య తరగతి వారి అనుబంధం, జీవన విధానాల గురించి పరిశీలించానని తెలిపారు. వారి జీవన స్థితిగతుల గురించి ఈ నవలలో వివరించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర నాయకులు కె.సత్య రంజన్‌ పాల్గొన్నారు.

➡️