బిజెపి నేతపై చర్యలేవి ? 

Jan 26,2024 11:19 #Attacks, #Bombay High Court, #Mumbai
bombay high court on action on bjp leader

ప్రశ్నించిన బాంబే హైకోర్టు

ముంబయి : గత సంవత్సరం సెప్టెంబరులో ఓ మసీదుపై జరిగిన దాడితో సంబంధం ఉన్న బిజెపి సీనియర్‌ నేత విక్రమ్‌ పావస్కార్‌పై తీసుకున్న చర్యలను వివరిస్తూ రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పావస్కార్‌పై చర్యకు డిమాండ్‌ చేస్తూ బాంబే హైకోర్టులో గతంలో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. వాస్తవానికి రాష్ట్రంలో విద్వేష ప్రసంగాలు చేసిన వారి పైన తరచుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. పోలీసులు కూడా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ వాటిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విక్రమ్‌ పావస్కార్‌ తరచూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతుంటారు. ఆయనపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా చర్యలు మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో పలువురు పిటిషనర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్‌ఐఆర్‌పై తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. మసీదుపై దాడి చేసిన కేసులో గత సంవత్సరం డిసెంబర్‌ 18న తుది ఛార్జిషీటు దాఖలైంది. అయితే ఆశ్చర్యకరంగా అందులో పావస్కార్‌ పేరు లేదు. దీనిపై కూడా న్యాయస్థానం పోలీసులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌కు, సాక్షులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది.

➡️