బిజెపి పొత్తు ప్రమాదకరం

రాష్ట్రానికి వినాశకరమైన ఎన్నికల పొత్తు పొడిచింది. తెలిసి తెలిసి తెలుగుదేశం, జనసేన పార్టీలు బిజెపి కొరివిని నెత్తిమీద పెట్టుకున్నాయి. తాత్కాలిక వెచ్చదనం కోసం ధృతరాష్ట్ర కౌగిలిలోకి చేరాయి. బిజెపితో పొత్తు కోసం తెలుగుదేశం వెంపర్లాడిన తీరు, ఒక్క శాతం ఓట్లు లేని పార్టీతో నలభై శాతానికి పైగా ఓట్ల బలం వున్న పార్టీ నేత ప్రాధేయపడుతూ, ఢిల్లీలో పడిగాపులు కాయడం చూస్తుంటే ‘అన్న’ గారి ఆత్మే కాదు, ఆంధ్రుల అంతరాత్మ తీవ్ర ఆవేదనకు గురవుతున్నది. రాజకీయాల్లో ఎత్తులు, పొత్తులు కొత్త కాదు. కానీ పొత్తులకు ఒక విధానం, లక్ష్యం వుండాలి కదా! టిడిపి, జనసేన ఏ విధానం, ఏ లక్ష్యం కోసం బిజెపితో పొత్తుకు సిద్ధమయ్యాయి? ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికా? విభజన చట్టం హామీల సాధనకా? లేదు దేశాభివృద్ధికా? ఢిల్లీ ప్రభువుల ముందు టిడిపి, జనసేన ఎందుకు మోకరిల్లుతున్నాయి? సయోధ్య కోసం వచ్చిన వారిపట్ల ఢిల్లీ బిజెపి నేతల ఆ చులకన భావమేమిటీ? రెండు పార్టీల నేతలను మూడు రోజులు పడిగాపులు కాసేటట్లు చేయడమేమిటీ? పొత్తులపై బిజెపి ఏకపక్షంగా ప్రకటన చేయడమేమిటీ? తెలుగుదేశానికి ఈ పరిణామం అనివార్యమా, అవకాశవాద ఫలితమా? సింహం సింగిల్‌గా వస్తుందని సినిమా డైలాగులు చెబుతున్న వైసిపి కూడా కేంద్రంతో లోపాయికారి పొత్తులోనే ఈ ఐదు సంవత్సరాలు తరించిందనే విషయం జగమెరిగిన సత్యం కదా!
బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు 2014లో కూడా కలిశాయి కదా. అప్పుడులేని ప్రమాదం ఇప్పుడు ఎందుకు వుంటుందని అమాయకంగా కొందరు అడుగుతున్నారు. చంద్రబాబు మరొక అడుగు ముందుకు వేసి తాను బిజెపికి మద్దతు ఇచ్చిన కాలంలో మత ఘర్షణలే జరగలేదని, ముస్లింల హక్కులను అప్పుడు తాను కాపాడానని ఆత్మవంచన చేసుకుంటున్నారు. 2014కు ముందు బిజెపి కేంద్రంలో అధికారంలో లేదు. రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కాంగ్రెసు అనే కోపం ఆనాడు ఆంధ్ర ప్రజల్లో ఉంది. బిజెపి అధికారంలోకి వస్తే విభజిత ఆంధ్ర అభివృద్ధికి మేలు జరుగుతుందని ప్రజలను నమ్మించగలిగారు. కాని గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిన తర్వాత, ఈ పది సంవత్సరాల్లో దేశంలో జరుగుతున్న మత కలహాలు, రాజ్యాంగానికి ఎదురవుతున్న ప్రమాదాలు చూసిన తర్వాత విజ్ఞత కలిగిన వారు ఈ పొత్తును ఎలా బలపరుస్తారు? కేంద్రం బిజెపి పాలనలో టిడిపి భాగస్వామిగా వున్న కాలంలో 5,417 మత ఘర్షణల కేసులు నమోదయినట్లు కేంద్ర హోంశాఖ 2020లో పార్లమెంట్‌కు తెలిపిన విషయం చంద్రబాబు మరచిపోయినా మత సామరస్యాన్ని కోరుకునే వారు మరవలేరు కదా!
‘నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది. ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీయవద్దు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వారికి ఎలా గుణపాఠం చెప్పాలో మాకు బాగా తెలుసు, మీరు మీ మార్గాన్ని సరిదిద్దుకోకపోతే ఆంధ్రప్రదేశ్‌ నుండి మీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది’ అని 2019 ఫిబ్రవరి 10న ఢిల్లీలో చంద్రబాబు మోడీని హెచ్చరించారు. నల్ల చొక్కా వేసుకుని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేశారు. బిజెపి యేతర 25 పార్టీల సంఘీభావాన్ని కోరారు. ఇందుకు ఒకరోజు ముందు గుంటూరు జిల్లాలో జరిగిన బహిరంగసభలో ‘కేంద్రం ఇస్తున్న నిధులను బాబు, లోకేష్‌ కాజేస్తున్నారని, పోలవరం ప్రాజెక్టును ఎటిఎం లాగా వాడేస్తున్నారని’ మోడీ విమర్శించారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని మోడీని పవన్‌కళ్యాణ్‌ పదేపదే విమర్శించారు. నాటి మాటలకు, నేటి పొత్తులకు విశ్వసనీయత వుండాలంటే గడిచిన ఈ ఐదేళ్ళలో మన రాష్ట్రానికి బిజెపి ఏమి మేలు చేసి…తాను చేసిన తప్పులను సరిదిద్దుకుందో చంద్రబాబు, పాచిన లడ్డూలు మంచి లడ్డూలు ఎలా అయ్యాయో పవన్‌ కళ్యాణ్‌, అవినీతి నుండి బాబు, లోకేష్‌లు ఎలా పునీతులయ్యారో మోడీ ప్రజలకు చెప్పాలి. బిజెపి మతోన్మాద పార్టీ అని, దాని కూటమిలో వుండడం దేశానికి ప్రమాదకరమని 2018లో ఎన్‌డిఎ కూటమి నుండి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది. ఈ ఐదు సంవత్సరాల్లో బిజెపి మత సామరస్య పార్టీగా, ఎన్‌డిఎ దేశ సంక్షేమ కూటమిగా మారిందని పొత్తుకు సిద్ధమై ఎన్‌డిఎ కూటమిలో చేరుతుందా? ఇరుపక్షాలు జవాబు చెప్పుకోవలసిన ప్రశ్నలు ఇవేకదా!
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే కేంద్ర పెత్తనానికి వ్యతిరేకంగా. అప్రజాస్వామికంగా ఎన్‌టిఆర్‌ ప్రభుత్వాన్ని నాడు కేంద్ర కాంగ్రెసు ప్రభుత్వం కూల్చివేస్తే దేశవ్యాప్తంగా పోరాడింది కమ్యూనిస్టులు, ప్రజాస్వామికవాదులు. నాటి నుండి సుమారు 25 సంవత్సరాలు తెలుగుదేశం, కమ్యూనిస్టులు ఎన్నికల్లో కలిసి పనిచేశారు. విధానపరమైన అనేక మౌలిక అంశాల మీద టిడిపి, కమ్యూనిస్టు పార్టీల వైఖరులు వేరైెనా, రాజ్యాంగంలోని కీలకమైన సమాఖ్య స్ఫూర్తి, లౌకికవాదం, సామాజిక తరగతుల సంక్షేమం అనే లక్ష్యాలు కమ్యూనిస్టులను, టిడిపిని సుదీర్ఘ కాలం కలిపి వుంచాయి. 1991 తర్వాత వచ్చిన ప్రపంచీకరణ విధానాలు ప్రాంతీయ పార్టీల వైఖరులను మార్చివేశాయి. విధానాల స్థానంలో అవకాశవాదానిది పై చెయ్యి అయ్యింది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వచ్చిన మార్పులు మరింతగా మార్చివేశాయి. పార్టీల మధ్య పొత్తులు పెట్టుకోవడానికి, విడిపోవడానికి విధానాలను గాలికి వదిలేసిన పాలక పార్టీలు, అందుకు విరుద్ధంగా సిద్ధాంత ప్రాతిపదికన పనిచేసే కమ్యూనిస్టు పార్టీలను, ఆ నేతలను నిందించడం, విమర్శించడం ఫ్యాషన్‌గా మారింది. పాలక పార్టీల అనుకూల మీడియా సంస్థలు ఇందుకు అనుగుణంగా వంత పాడి రాజకీయాలను మరింతగా భ్రష్టుపట్టించాయి. తాము అనుసరించిన అవకాశవాద విధానాలే నేడు ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చివేస్తున్నాయి. కేంద్ర బిజెపి కనుసన్నల్లో వుంటేనే తమకు భవిష్యత్‌ అనే దీనావస్థకు దిగజార్చాయి. బిజెపి కేవలం రాజకీయ అధికారాన్ని మాత్రమే కోరుకోవడంలేదు. రాజ్యాంగాన్ని, దాని మూల స్థంభాలను ధ్వంసం చేసి మత రాజ్యాన్ని నిర్మించాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నది. అందుకే అది రాజకీయాలు మాత్రమే చేయడంలేదు. ప్రాంతీయ పార్టీలను మింగివేసి ఏక పార్టీ వ్యవస్థను నిర్మించాలనే వినాశకరమైన లక్ష్యంతో పని చేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత జరిగిన ఈ పది సంవత్సరాలు కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి, వైసిపి చెరో ఐదు సంవత్సరాలు పాలించాయి. ఈ రెండు పార్టీలు కేంద్ర బిజెపి ప్రభుత్వంతో విడదీయరాని స్నేహంగానే వున్నాయి. పార్లమెంట్‌లో బిజెపి పెట్టిన ప్రతి బిల్లును, ప్రతి నిర్ణయాన్ని ఏ చర్చ లేకుండా బలపరుస్తూ వచ్చాయి. ప్రత్యేక హోదా ఐదు కాదు పది సంవత్సరాలు ఇస్తామని, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కేంద్రసంస్థల ఏర్పాటు జరిగి తీరుతాయని నాడు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ లతో కలిసి మోడీ చెప్పారు. మన సంఖ్యా బలంతో అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వచ్చిందనే సాకుతో వైసిపి ఈ ఐదు సంవత్సరాలు నిస్సిగ్గుగా బిజెపిని అన్ని విషయాల్లో సమర్థించింది. అయినా గత ఐదు, ప్రస్తుత ఐదు సంవత్సరాలు రాష్ట్రాభివృద్ధికి నిధులు ఎందుకు రాలేదు? విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు పూర్తిగా ఎందుకు నోచుకోలేదు? రాష్ట్రాల హక్కులను కాలరాసే కేంద్ర నిరంకుశ చర్యలను, మత సామరస్యాన్ని దెబ్బ తీసే మతోన్మాద దుర్మార్గాలను, జాతి సంపదను, ప్రకృతి వనరులను కార్పొరేట్లకు అప్పగించే వినాశకర విధానాలను పార్లమెంట్‌లో ఎన్‌డిఎ పార్టీల కంటే ఎక్కువగానే వైసిపి, టిడిపి బలపరిచి తమ ప్రభు భక్తిని అనునిత్యం చాటుకున్న బిజెపి ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు ద్రోహం చేస్తూనే వచ్చింది?
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అన్ని విధాలా అన్యాయం చేసినా కేంద్ర బిజెపి ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రజలు ఆలోచించకుండా, ప్రశ్నించకుండా వుండేందుకు టిడిపి, వైసిపి పోటీలు పడి కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. యుద్ధం, సిద్ధం అంటూ ఒకదానిపై ఒకటి రంకెలు వేసుకుంటున్నాయి. దశాబ్దం తర్వాత కూడా రాజధాని లేక, పోలవరం పూర్తికాక, కేంద్ర సంస్థలు ఏ ఒక్కటి నిర్మాణం జరగకపోయినా బిజెపిని ఎందుకు బలపరుస్తున్నాయి? కేవలం అధికార కాంక్ష, వ్యక్తిగత కేసుల భయం. గత ఎన్నికల ముందు ఏ కారణాలు చెప్పి ఎన్‌డిఎ నుండి బయటకు వచ్చారో అదే కారణాలపై టిడిపి ఈ కాలంలో పోరాడి వుంటే రాష్ట్ర పరిస్థితి, టిడిపి పరిస్థితి ఇంత ఘోరంగా వుండేది కాదు. పోలవరం, రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా, కేంద్రం అండతో మూడు రాజధానుల పేరుతో జగన్‌మోహన్‌రెడ్డి కొత్త నాటకాన్ని ఐదు సంవత్సరాలు కొనసాగించినా, రాజధాని నిర్మాణం చేపట్టకపోయినా, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, చివరకు తనను జైలులో పెట్టడానికి పరోక్షంగా కారణమైనా బిజెపిని ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిని చంద్రబాబు కొని తెచ్చుకున్నారు. తనను జైల్లో పెట్టడంలో కేంద్ర బిజెపి పాత్ర లేదని ఢిల్లీలో చంద్రబాబు ప్రకటించుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుగుదేశం శ్రేణులు ఆలోచించుకోవాలి. డీజల్‌, పెట్రోల్‌ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా, మణిపూర్‌లో ఘోర నరమేధం జరిగినా, బిల్కిస్‌బానో కుటుంబంపై హత్యాచారాలకు పాల్పడిన వారిని స్వేచ్ఛగా వదిలేసినా, అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేస్తున్నా చంద్రబాబు, టిడిపి కనీసం స్పందించలేని రాజకీయ అనిశ్చితిలోకి చేరుకున్నాయి. దీనికితోడు తనకున్న కొద్దిపాటి ఎంపీల ద్వారా, తన అనుచరులను బిజెపిలో చేర్చడం ద్వారా బిజెపికి దగ్గరకు కావడానికే ఈ కాలమంతా ప్రయత్నించారు. ఒకనాడు ఢిల్లీలో చక్రం తిప్పారనే వ్యక్తి నేడు బిజెపి నేతల చుట్టూ ప్రదక్షిణలు చేసే స్థాయికి చేరుకున్నారు! బిజెపితో పొత్తు కుదుర్చుకుంటున్న టిడిపి, జనసేనలను విమర్శిస్తున్న వైసిపి…రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమైన బిజెపిని మాత్రం ఏమీ మాట్లాడలేదు.
ఏ పార్టీతో బిజెపి స్నేహం చేసినా అది కేవలం ఎన్నికలు, అధికారం కోసం మాత్రమే కాదు, దాని దీర్ఘకాలిక లక్ష్యం సాధించుకోవడానికే నన్నది జగమెరిగిన సత్యం. తనతో స్నేహం చేసిన పార్టీలను మింగివేయడం దాని సంస్కృతి. తనతో కలిసి పనిచేసిన శివసేన (బిజెపి కంటే కరుడు కట్టిన హిందూ పార్టీగా ఒకనాడు గుర్తింపు వున్న పార్టీ), అనేక సంవత్సరాలు బీహార్‌ రాజకీయాలను శాసించిన నితీష్‌ కుమార్‌ పార్టీ, తమిళనాడులో అన్నాడిఎంకె…ఇలా ఒకటేమిటి అనేక పార్టీల పరిస్థితి ఏ స్థాయికి చేరిందో, బిజెపి పట్ల ఊగిసలాడిన బిఆర్‌ఎస్‌ తెలంగాణలో ఎలా గిలగిల కొట్టుకుంటోందో చూస్తున్నాము. ఇన్ని అనుభవాలు కళ్ళ ముందు వున్నా బిజెపితో స్నేహానికే తెలుగుదేశం పార్టీ సిద్ధపడడం స్వయంకృతాపరాధం, ఆత్మహత్యా సదృశ్యం. బిజెపితో టిడిపి, జనసేన స్నేహం కేవలం ఆ పార్టీలకే కాదు. ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరం. టిడిపి, జనసేనలతో ప్రత్యక్షంగా, వైసిపితో పరోక్షంగా రాష్ట్ర రాజకీయాల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి ప్రమాదాన్ని చైతన్యవంతమైన రాష్ట్ర ప్రజలు రాజకీయ విజ్ఞతతో తిప్పికొట్టడం రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకం.

 

 

 వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

➡️