పుట్టువులుగ మన ధర్మం !

Jan 27,2024 09:40 #sahityam

 

పుడమి మీద మొక్క లేదు

పురములందు గాలి లేదు

పులుగు రెక్కలాడలేదు

పురుగు పుట్రా కానరాదు!

 

పులకరింత సుంతలేదు

పుడక కాల్చ మిగలలేదు

పురుషయత్నమేమి లేదు

పూతలేక హరితమేది ?

 

పులుపు, తీపి పండ్లు లేవు

పురుడాడిన మొలక లేదు

పుట్ల కొలది పండు పంట

పుడిసెడైన కానరాదు !

 

పులులు లేవు గిలులు లేవు

పుట్టబోవు జీవులేవి

పుండైనది ధరణి నేడు

పుటలు వ్రాయ చరితలేదు

 

పుచ్చపూల మేఘమేది ?

పులకిత జీవనమెయ్యది ?

పురోగమన మనుపేరున

పుట్ట, గట్టు ప్లాటులయ్యె !

 

పురాణాలు నాడు వనులు

పుంజుకొన్న కథలు గలవు

పుత్తడి బతుకులు బతికిరి

పుస్తకములు లేని నాడు !

 

పుష్పాలై విరబూద్దాం

పునీతులుగ చరించుద్దాం

పుడమిని రక్షించుకొనుట

పుట్టువులుగ మనధర్మం !

– కిలపర్తి దాలినాయుడు,సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు,రామభద్రపురం.

➡️