బిల్లులు చెల్లించాల్సిందే : ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి : ప్రభుత్వ భవనాలు, రోడ్ల నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్న గత ఆదేశాలను అమలు చేయని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్‌ సింగ్‌ రావత్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే విచారణ నాటికి బిల్లులు చెల్లించాలని, లేనిపక్షంలో అప్పుడు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంది. గత ఆదేశాల మేరకు కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహించింది. కనీసం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని పిటిషన్‌ కూడా వేయలేదని తప్పుపట్టింది. కోర్టు ధిక్కార చట్టం కింద ఆయనకు ఫాం-1 నోటీసు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి వడ్డిబోయన సుజాత శుక్రవారం ఆదేశాలిచ్చారు. ఆర్‌అండ్‌బి పరిధిలోని నిర్మాణాలకు బిల్లులు చెల్లించడం లేదంటూ పలువురు కాంట్రాక్టర్లు గతేడాది వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది.

➡️