సర్వర్లు పనిచేయక లబ్ధిదారులు అవస్థలు

Feb 13,2024 01:17

ప్రజాశక్తి – రేపల్లె
జగనన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం సర్వర్లు పనిచేయక సచివాలయానికి వెళుతున్న లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ ఆరోపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయలవద్ద వేచి ఉన్నప్పటికి రిజిస్ట్రేన్లు అవ్వక లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ వేగవంతంగా జరిగేలా కమిషనర్ సమన్వయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగనన్న కాలనీలో సమస్యలు తెలుసుకోవడానికి గత 4రోజుల నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తాము వెళుతున్న నేపథ్యంలో అనేకమంది లబ్ధిదారులు వాపోతున్నారని తెలిపారు. రోజువారి పనులు చేసుకునే వాళ్ళు 18వ వార్డులో ఉన్న జగనన్న కాలనీ నుండి 4కీలోమీటర్లు దూరంలోని 1వ వార్డు లేదా 2వ వార్డు సచివాలయానికి నడిచివెళ్లి అక్కడ గంటలకొద్ది వేచినా రిజిస్ట్రేషన్‌ కావడంలేదని తెలిపారు. సర్వర్లు పనిచేయడం లేదని చెబుతున్నట్లు తెలిపారు. పేదలు పనులు మానుకుని సచివాలయాల చుట్టూ తిరిగి ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ఇళ్లవద్దకే వచ్చి కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకుని రిజిష్ట్రేషన్‌ చేయాలని కోరారు. లబ్దిదారులు నివాసం ఉంటున్న సచివాలయం పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరారు. రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో మున్సిపల్‌ అధికారులు శ్రద్ద చూపడం లేదని అన్నారు. పట్టణంలో కొన్ని సచివాలయాలు 5వ వార్డు కమ్యూనిటీ హాల్ పైన 2 సచివాలయలు, పెదకూరకాయలు మార్కెట్ మున్సిపల్ కాంప్లెక్స్ పైన 2 సచివాలయాలు ఉండటంవల్ల మహిళలు, వృద్దులు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు సచివాలయాలపైకి ఎక్కలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజలకు అందుబాటులో సచివాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కె ఆశీర్వాదం, కెవి లక్ష్మణరావు పాల్గొన్నారు.

➡️