Priyanka Gandhi : ‘జంగిల్‌ రాజ్‌ ‘ లో మహిళగా ఉండటం కూడా నేరమే..

 లక్నో :    ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై పెరుగుతున్న నేరాలపై యోగి ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ గురువారం విరుచుకుపడ్డారు. ”ఈ జంగిల్‌ రాజ్‌లో మహిళగా ఉండటం కూడా నేరంగానే మారింది” అని అన్నారు. సామూహిక అత్యాచారానికి గురైన ఇద్దరు మైనర్‌ బాలికలు కాన్పూర్‌లో ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పుడు వారి తండ్రి కూడా జీవితాన్ని ముగించుకున్నాడని అన్నారు. రాజీ కోసం బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి తీసుకువచ్చారని మండిపడ్డారు.

యుపిలో తమకు న్యాయం చేయాలని కోరిన బాధిత మహిళలు, బాలికల కుటుంబాలను అంతం చేయడం యోగి ప్రభుత్వ ఆనవాయితీగా మారిందని ధ్వజమెత్తారు. ఉన్నావ్‌, హత్రాస్‌ నుండి కాన్పూర్‌ వరకు ఎక్కడైతే మహిళలకు చిత్రహింసలకు గురయ్యారో.. ఆ మహిళల కుటుంబాలు కూడా అంతమయ్యాయని అన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ అనేదే లేని జంగిల్‌ రాజ్‌లో మహిళగా  ఉండటం నేరంగా మారిందని ధ్వజమెత్తారు.  రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలు ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలని ప్రశ్నించారు.

ఇటీవల అత్యాచారం జరిగిన కొన్ని రోజుల అనంతరం కాన్పూర్‌లో వారు పనిచేస్తున్న ఇసుక బట్టీ సమీపంలోని పొలంలో ఇద్దరు మైనర్‌ బాలికలు శవాలై కనిపించిన సంగతి తెలిసిందే.

➡️