అద్వానీకి భారతరత్న ఇవ్వడం వెనుక…

article on Behind giving Bharat Ratna to Advani ram mandir

మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం… బిజెపి నేత, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. మండల్‌ రాజకీయాలను ప్రవేశపెట్టి అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న లభించిన 11 రోజుల తర్వాత అద్వానీకి భారతరత్న వరించింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ఈ రెండు భారతరత్న అవార్డులను ఊహించని విధంగా ప్రకటించారు. అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని హడావుడిగా ప్రారంభించారని శంకరాచార్య స్వామి స్వయంగా విమర్శలు గుప్పించారు. అవార్డుల ప్రకటనలోనూ అదే హడావుడి కనిపిస్తోంది. దీనికి ఒక్కటే కారణం. ఏప్రిల్‌, మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల హడావిడే ఇది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే తపనలో భాగంగానే భారతరత్న అవార్డు ప్రకటనలు వెలువడుతున్నాయి. అద్వానీకి మోడీ అకస్మాత్తుగా భారతరత్న ప్రకటించడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు అద్వానీ ఎవరో తెలుసుకుందాం.

అద్వానీ 1927లో పాకిస్తాన్‌ వాణిజ్య రాజధాని కరాచీలో సింధీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. క్రిస్టియన్‌ చర్చి ఆధ్వర్యంలో నడిచే సెయింట్‌ పాట్రిక్స్‌ స్కూల్లో చదువుకునారు. పద్నాలుగేళ్ల వయసులో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఆయన పాకిస్తాన్‌లో ఉన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నట్లు నేను వినలేదు. 1947లో అద్వానీ కుటుంబం బొంబాయికి వచ్చింది. 1951లో శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ నాయకత్వంలో అఖిల భారతీయ జనసంఫ్‌ు (బిజెఎస్‌) స్థాపించినప్పుడు, అద్వానీ దానిలో క్రియాశీల సభ్యునిగా మారారు. మొదట రాజస్థాన్‌లో పనిచేశారు. 1960ల ప్రారంభంలో, కార్యకలాపాల కేంద్రాన్ని ఢిల్లీకి మార్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ‘ఆర్గనైజర్‌’ సంపాదకీయ విభాగంలో ఏడేళ్లపాటు పనిచేశారు. 1972లో జన్‌సంఫ్‌ు అధ్యక్షుడయ్యారు. 1980లో వాజ్‌పేయి నాయకత్వంలో బిజెపి ఏర్పాటయ్యాక, ఆ పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఆయన ఒకరిగా మారారు. మూడు సార్లు (1986-91, 1993-98, 2004-05) బిజెపి అధ్యక్ష పదవిని అలంకరించారు. లోక్‌సభకు ఏడు సార్లు, రాజ్యసభకు నాలుగు సార్లు సభ్యుడిగా ఉన్నారు. ఎమర్జెన్సీ తర్వాత అధికారంలోకి వచ్చిన మొరార్జీ దేశారు మంత్రివర్గంలో ప్రసార శాఖ మంత్రి అయ్యారు. వాజ్‌పేయి క్యాబినెట్‌లో హోం మంత్రి (1998-2004)గాను, 2002 నుంచి 2004 వరకు ఉపప్రధానిగా పనిచేశారు. 1984లో లోక్‌సభలో కేవలం రెండు సీట్లతో కేంద్రంలో బిజెపి ని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు ఎవరని ప్రశ్నిస్తే… అద్వానీ తప్ప మరో సమాధానం చెప్పలేరు. సంఫ్‌ు పరివార్‌ అద్వానీకి రెండవ సర్దార్‌ పటేల్‌, నయా సర్దార్‌ పటేల్‌ అనే బిరుదులను కూడా ఇచ్చింది. కానీ బిజెపి ఎదగడానికి అద్వానీ అనుసరించిన పద్ధతులు భారతదేశానికి వినాశకరమైనవి.

మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇందిరా గాంధీ ప్రభుత్వానికి సమర్పించిన, బి.పి మండల్‌ కమిషన్‌ నివేదికను 1990లో వి.పి.సింగ్‌ ప్రభుత్వం అమలు చేసింది. దీని ప్రకారం ఒబిసి కేటగిరీకి 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే 12 ఏళ్ల క్రితం బీహార్‌ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ 26 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. బీహార్‌లో మహా దళితులనే అత్యంత వెనుకబడిన వర్గానికి రిజర్వేషన్లు కల్పించి నితీష్‌ కుమార్‌ కూడా విజయం సాధించారు. ‘ఇండియా’తో పొత్తు నుంచి నితీష్‌ కుమార్‌ను బయటకు లాగేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ బీహార్‌’ పథకంలో భాగంగా కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న లభించింది. బిజెపి భారతరత్నను సామాజిక న్యాయం కోసం కాక అధికారం కోసం ఆయుధంగా ఉపయోగిస్తున్నది.

సామాజిక న్యాయం అనేది ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నినాదం కాదు. అందుకే వి.పి.సింగ్‌ హయాంలో మండల్‌ కమిషన్‌ రిపోర్టు అమలులోకి రాగానే అద్వానీ రథయాత్రతో ముందుకు వచ్చారు. హిందువులను ఏకతాటిపైకి తెచ్చి అధికారం చేజిక్కించుకోవాలనే బిజెపి వ్యూహానికి మండల్‌ కమిషన్‌, రిజర్వేషన్లు అడ్డంకిగా నిలిచాయి. అందుకే రాముడి పేరుతో బిజెపికి హిందూ ఓట్లు రాబట్టాలనే లక్ష్యంతో 1990 సెప్టెంబర్‌ 25న గుజరాత్‌లోని సోమనాథ దేవాలయం నుంచి రామరథ యాత్ర ప్రారంభమైంది. అక్టోబర్‌ 30న అయోధ్యలో రథయాత్ర ముగిసేలా నిర్వహించారు. ఈ యాత్రకు అద్వానీ దర్శకుడు, నిర్మాత, నటుడు. ఈ టయోటా రథయాత్ర లక్ష్యం దేశ ప్రజలను హిందువులు, ముస్లింలు అని రెండుగా విభజించి బిజెపి తో మెజారిటీ ఓట్లను పొందడమే. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి లు తమ లక్ష్యాన్ని సాధించేందుకు జాతా సాగిన అన్ని మార్గాలోను మత అల్లర్లను సృష్టించాయి.

ఈ యాత్రలో వివిధ ప్రాంతాల్లో జరిగిన మత అల్లర్లలో 564 మంది చనిపోయారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 224 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో 99 మంది, కర్ణాటకలో 88 మంది, రాజస్థాన్‌లో 52 మంది మరణించారు (ది వైర్‌ ప్రచురించింది). రామ రథ యాత్ర జనయాత్రగా మారిందని పేర్కొంటూ, అద్వానీ మందిర్‌ వహీ బనాయేంగే (బాబ్రీ మసీదు ఉన్న స్థలంలోనే ఆలయం నిర్మిస్తారు) కౌన్‌ రోకే గా, కౌన్సీ సర్కార్‌ రోఖ్నీ వాలీ హై (ఎవరు ఆపగలరు, ఏ ప్రభుత్వం ఆపుతుంది) అంటూ సవాల్‌ విసిరారు.

ఈ రథాన్ని బీహార్‌లోని సమస్తిపూర్‌లో నిలిపివేశారు. అద్వానీ అక్టోబర్‌ 10, 1990 తెల్లవారుజామున అరెస్ట్‌ అయ్యారు. ఈ రామ్‌రథాన్ని ఏ ప్రభుత్వం అడ్డుకోగలదన్న అద్వానీ ప్రశ్నకు బీహార్‌ లోని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రథయాత్ర ఆపడానికి ముందు లాలూ ప్రసాద్‌ చేసిన ప్రసంగం మతవాదుల రాజకీయాలను బట్టబయలు చేసింది.

రథయాత్రను అడ్డుకున్నందుకు వి.పి.సింగ్‌కు బిజెపి మద్దతు ఉపసంహరించుకుంది. విశ్వాస పరీక్షలో బిజెపితో పాటు కాంగ్రెస్‌ కూడా ఓటు వేసింది. వి.పి.సింగ్‌ ప్రభుత్వం కూలిపోయింది. మండల్‌ కమిషన్‌ నివేదికను అమలు చేసిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యాన్ని బిజెపి, అద్వానీ సాధించారు. దీని తరువాత, 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేయబడింది. అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి అయోధ్యలో బాబ్రీ మసీదు మినార్లు కూలిపోయినప్పుడు కరసేవకులకు నాయకత్వం వహించారు. శతాబ్దాల నాటి బాబ్రీ మసీదు శిథిలాల కుప్పగా మారడంతో ఉమాభారతి జోషిని కౌగిలించుకుని ఆనందోత్సాహాలతో నృత్యం చేశారు.

ఆ రోజు అయోధ్యలో లౌకిక రాజ్యం కూలిపోయింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ నిందితుడైనప్పటికీ ఆ తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు. అయితే, రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసిన 2019 నాటి సుప్రీంకోర్టు తీర్పు కూడా బాబ్రీ మసీదు కూల్చివేత క్రిమినల్‌ నేరమని నిర్ద్వంద్వంగా ప్రకటించింది. ఆ నేరపూరిత చర్యకు పాల్పడిన అద్వానీని భారతరత్నతో సత్కరిస్తున్నారు.

అనంతరం అద్వానీ స్పందిస్తూ బాబ్రీ మసీదు కూల్చివేత తన జీవితంలో చీకటి రోజు అన్నారు. ఆ బ్లాక్‌ డే అద్వానీ స్వీయ సృష్టి. అందుకు భారతరత్నను ప్రదానం చేస్తారా?

అద్వానీ రామ రథయాత్రతో రాజకీయంగా భారీ లాభాలు ఆర్జించిన ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి లు ప్రాణప్రతిష్ట వేడుకలో పాల్గొనకుండా అద్వానీని అగౌరవపరచడం కూడా దేశం చూసింది. అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిల ఉనికిని ఆలయ ట్రస్టు కోరుకోవడం లేదని మోడీకి అత్యంత విశ్వసనీయుడైన చంపత్రారు తొలిసారిగా స్పష్టం చేశారు. ఇది వివాదాస్పదంగా మారడంతో విశ్వహిందూ పరిషత్‌ నేతలు అద్వానీ, జోషిలను ఆహ్వానించినా వారు కార్యక్రమానికి హాజరు కాలేదు.

శంకరాచార్య స్వామి, అద్వానీ, జోషిలను ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం నుంచి తప్పించడంపై యు.పిలోని బ్రాహ్మణులు కలత చెందారు. ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని బిజెపి ఆందోళన చెందుతోంది. ఇది కూడా అద్వానీకి భారతరత్న ఇవ్వాలని మోడీని ప్రేరేపించి ఉండవచ్చు.

అద్వానీకి భారతరత్న ఇవ్వడాన్ని సమర్థించడంలో మోడీకి వ్యక్తిగతంగా, పార్టీ అధినేతగా ఎలాంటి ఇబ్బంది లేదు. వాస్తవానికి గుజరాత్‌లో ముఖ్యమంత్రి పీఠాన్ని చేజార్చుకోబోతున్న సమయంలో మోడీకి కుర్చీని కట్టబెట్టింది అద్వానీ. 2002లో గోద్రా ఘటన నేపథ్యంలో 2000 మందికి పైగా ముస్లింలను చంపిన అల్లర్ల సమయంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు వాజ్‌పేయి రాజ ధర్మాన్ని పాటించాలని మోడీని కోరారు. అదే ఏడాది గోవాలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో వాజ్‌పేయి మోడీకి రాజధర్మాన్ని గుర్తు చేశారు.

ఆ రోజు మోడీని కాపాడింది బిజెపికి ఉక్కు మనిషి, అతివాది అని పేరు తెచ్చుకున్న అద్వానీ. వాజ్‌పేయి ఎత్తుగడ గురించి ముందే తెలుసుకున్న అద్వానీ… మోడీ వల్లే రాజీనామా చేస్తున్నట్టు స్వయంగా చెప్పుకున్నారు. ‘హిందూ హృదయ చక్రవర్తి’గా భావించే మోడీని మార్చడం సరికాదన్న ప్రచారానికి బలం చేకూరుస్తూ అద్వానీ తెరపైకి వచ్చారు. నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌లో మెజారిటీ ఇటువైపు ఉండటంతో మోడీని తొలగించాలనే అభిప్రాయాన్ని వాజ్‌పేయి విరమించుకున్నారని ‘ది హిందూ’లో రిపోర్టర్‌ నీనా వ్యాస్‌ రాశారు. దీన్నిబట్టి 2002లో మోడీ ముఖ్యమంత్రి పదవిని కాపాడింది అద్వానీ అని స్పష్టమవుతోంది. కానీ ఆ అద్వానీని తిరస్కరించి 2014లో మోడీ ప్రధాని అభ్యర్థిగా మారారు.

వాజ్‌పేయి 2004లో ‘భారతదేశం వెలిగిపోతోంది’ అంటూ ఎన్నికల బరిలోకి దిగారు. బిజెపి ఘోరంగా విఫలమైన తర్వాత వాజ్‌పేయి శకం ముగిసింది. 2009 ఎన్నికల్లో అద్వానీని హైలైట్‌ చేస్తూ బిజెపి ఎన్నికలను ఎదుర్కొంది. అంతకన్నా దారుణమైన ఓటమితో బిజెపిలో అద్వానీ శకానికి తెర పడింది. కానీ నాయకత్వ స్థానం నుంచి తప్పుకునేందుకు అద్వానీ సిద్ధంగా లేరు. ఆర్‌ఎస్‌ఎస్‌ తన ప్రచారకర్త మోడీని ముందుంచి 2014 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు మార్గం సుగమం చేసినప్పటికీ అద్వానీ ఆశలు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. 2013లో గోవాలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గంలో మోడీని ప్రధాని అభ్యర్థిగా అధికారికంగా ప్రచారం చేశారు. ఆ సమావేశానికి అద్వానీ హాజరు కానప్పటికీ, గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. సొంతంగా మెజారిటీ సాధించి మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక… అద్వానీ స్థానం కనీవినీ ఎరుగని విధంగా సలహా మండలిలో కనిపించింది. అద్వానీకి వెనక్కి తగ్గడం తప్ప మరో మార్గం లేదు.

అద్వానీ పాలకుడిగా కూడా పూర్తిగా విఫలమయ్యాడు. ఆయన కాలంలోనే భారత పార్లమెంటుపై చరిత్రలో తొలిసారిగా ఉగ్రదాడి జరిగింది. 2021 డిసెంబర్‌ 13న దాడి జరిగినప్పుడు పార్లమెంటు భవనంలోని పాత్రికేయులలో ఈ రచయిత ఒకరు. 22 ఏళ్ల తర్వాత బిజెపి అగ్రనేత అమిత్‌ షా హోంమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో మరోసారి దాడికి పాల్పడ్డారు. కార్గిల్‌ యుద్ధం (మే-జులై 1999) కూడా అద్వానీ హయాంలోనే జరిగింది. లాహోర్‌ బస్సు యాత్ర తర్వాత పాకిస్తాన్‌ సైన్యం కార్గిల్‌లోకి ప్రవేశించింది. అద్వానీ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్‌ దీనిని ముందుగానే పసిగట్టలేకపోయింది. ఇది చరిత్రలో అతి పెద్ద ఇంటెలిజెన్స్‌ వైఫల్యాలలో ఒకటి. అదే విధంగా దేశం అవమాన భారంతో తలవంచాల్సిన కాందహార్‌ ఘటన కూడా అద్వానీ హోంమంత్రి అయ్యాక జరిగింది. ఆఫ్ఘనిస్థాన్‌కు ప్రత్యేక విమానంలో మసూద్‌ అన్సార్‌ సహా ఉగ్రవాదులను రక్షించిన ఘటన లోహ్  పురుష్‌ అద్వానీ ప్రతిష్టకు మచ్చ. ముంబై ఉగ్రదాడి వెనుక వున్నది…బిజెపి ప్రభుత్వం అప్పట్లో రక్షించిన ఉగ్రవాదులే. అలాంటి పాలకుడికి దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చి గౌరవించడం ఏమిటి?

చివరిగా ఇంకొక్క విషయం ప్రస్తావించుకుందాం. సంఫ్‌ు పరివార్‌లు విభజన రాజకీయాల వాదులు. దేశంలో విభజన రాజకీయాలకు మొదట బీజం వేసింది సావర్కర్‌, హిందుత్వ రాజకీయ నాయకులు. కానీ ముస్లిం లీగ్‌, దాని నాయకుడు మహమ్మద్‌ అలీ జిన్నా విభజనకు బీజాలు వేశారని వారు ప్రచారం చేస్తారు. అయితే ఈ జిన్నాను గొప్ప నాయకుడని, సెక్యులర్‌ నేతగా అభివర్ణించింది అద్వానీయే. జిన్నా ప్రస్తావన సాధారణంగా వాజ్‌పేయి కంటే సాధారణ ప్రజలకు మరింత ఆమోదయోగ్యమైనదిగా మారడానికి, మితవాదిగా అతని ఇమేజ్‌ను మార్చడానికి అద్వానీ ఉద్దేశపూర్వక ప్రయత్నంలో భాగంగా పరిగణించబడుతుంది. 2004లో లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేయి పూర్తిగా ఓడిపోయినప్పుడు అద్వానీ చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాను నొక్కి చెబుతున్నాయి. 2005లో పాక్‌ పర్యటన సందర్భంగా అద్వానీ ఈ వ్యాఖ్య చేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆగ్రా సమ్మిట్‌ విజయవంతం కాకుండా అడ్డుకోవడానికి అద్వానీ (నీనా వ్యాస్‌ ‘ది వైర్‌’కి వెల్లడించినట్లు), జిన్నాను ప్రశంసించిన సంగతి కూడా గుర్తుంచుకోండి. అంటే విభజన రాజకీయాలకు కారకులైన వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌, మహమ్మద్‌ ఆలీ జిన్నా ఇద్దరినీ ఆరాధించే అద్వానీకి భారతరత్న ఇవ్వడం ఎంతవరకు సమంజసం? చరిత్రలో మోడీని నిలదీసే సమయం వస్తుందని ఆశిద్దాం.

  • వి.బి. పరమేశ్వరన్‌ (‘పేట్రియాట్‌ వీక్లీ’ నుండి)
➡️