నిర్బంధం నుంచి నూతన ఆలోచనలకు నాంది

Feb 19,2024 11:02 #cpm, #Lenin

లెనిన్‌ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలి

పుస్తకావిష్కరణలో రాంభూపాల్‌

ప్రజాశక్తి – కదిరి టౌన్‌ :   లెనిన్‌ తన చిన్న వయసులోనే ప్రజహితం కోసం జైలుకెళ్లారని, అక్కడ నిర్బంధం అనుభవిస్తూనే ప్రజాక్షేమం కోసం నూతన ఆలోచనలకు నాంది పలికారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎల్‌ఐసి అభివృద్ధి అధికారి పిళ్లా కుమారస్వామి రచించిన ”లెనిన్‌ నేడు లేడు.. చూడు జనంలో ఉన్నాడు..!’ పుస్తకాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ.. లెనిన్‌ జీవించిన కాలమంతా పీడిత ప్రజల కోసం పని చేశారన్నారు. కారల్‌మార్క్స్‌ రచించిన సిద్ధాంతాన్ని ఆచరణలో చూపెట్టిన మహనీయుడని కొనియాడారు. పీడిత ప్రజల కోసం పెట్టుబడిదారి, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించి రష్యాలో విప్లవాన్ని సాధించారని గుర్తు చేశారు. ఏ పదజాలం వెనుక ఏ వర్గ ప్రయోజనం ఉంటుందో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని ఆయన చెప్పిన మాట ఇప్పటికీ మన కంటికి కనిపిస్తూనే ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నడుస్తున్నాయని తెలిపారు. లెనిన్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రజా హితం కోసం ముందుకు సాగాలని కోరారు. లెనిన్‌ కృషిని పుస్తక రూపంలో తీసుకురావడంలో రచయిత పిళ్లా కుమారస్వామి తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత పిళ్లా కుమారస్వామి, వామపక్ష పార్టీ నాయకులు సుబ్బిరెడ్డి, జిఎల్‌.నరసింహులు, రాజేంద్ర, రమణ, రామకష్ణ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️