వాక్యాంతం లోపు …

Dec 4,2023 08:46 #sahityam

దారులన్నీ మూసుకుని పోయాక

వెతకటం ఆపేశాను

గాలికి చెదపట్టదు

ఆశబోతు మనసులకు

ఇప్పుడు నిద్రపట్టదు

మనిషితనం కోసం యిక వెతకను

మానవత్వం జాడ ఎవరినీ అడగను

ఇప్పుడు స్వరంలో కోరస్‌ కోసం

ఎదురుచూపు లేదు

అంతా ఏకాంత గానమే

ఆయుష్షు ఆవిరయే లోపు

మనిషి ఆనవాళ్ళు దొరుకుతాయో లేదో

వాక్యాంతం లోపు

మొగ్గలు విచ్చుకున్నా

పరిమళం లేదనే

పూల కన్నీళ్ళ బాధ చూస్తానేమో!

నెర్రెలు బారిన నేలని చూసి

నెత్తిన గుడ్డేసుకున్న రైతు

కంటి చినుకులు కనబడతాయేమో!

అంతా పంచుకోవటమే

అన్నిటా తెంచుకోవటమే

అనుబంధాలు యిక అందని ద్రాక్షలే..

ఊహలేవి అల్లుకోవటం లేదు

అంతా తునకలు తునకలుగా

కళ్ళకు ఉల్లాసమిచ్చే

రంగుల సీతాకోకలు కనిపించవు

కాలం అదృశ్యమయ్యాక

చూపులు శూన్యంలో దిగబడ్డాయి

దూరంగా ఎవరో తనకు కావలసిన

ఆరడుగుల నేల మోసుకెళ్తున్న

మసకబారిన దృశ్యం

అన్ని స్పందనలు కోల్పోయిన

గుండె యిప్పుడో సత్తు నాణెం! – డాక్టర్‌ పెరుగు రామకష్ణ – 98492 30443

➡️