ఒలింపిక్స్‌ నుంచి ఇజ్రాయెల్‌ను బహిష్కరించండి : ఐఒసికి పాలస్తీనా పౌర సమాజం విజ్ఞప్తి

Jan 20,2024 10:48 #Sports

గాజా : గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ను ఒలింపిక్స్‌ నుంచి బహిష్కరించాలని పాలస్తీనా క్రీడాకారులు, పౌర సమాజం డిమాండ్‌ చేసింది. 300 కంటే ఎక్కువ పాలస్తీనా స్పోర్ట్స్‌ క్లబ్‌లు, డజన్ల కొద్దీ పాలస్తీనా పౌర సమాజ సంస్థలు ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసి) ని కోరాయి.పాలస్తీనియన్‌ పురుషులు , మహిళల ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ , వాలీబాల్‌ క్లబ్‌లు, ఇజ్రాయెల్‌ సైనికులచే చంపబడిన వారి ఆటగాళ్ల కుటుంబ సభ్యులు సంయుక్తంగా ఈ పిలుపునిచ్చాయి. ”తదుపరి ఒలింపిక్‌ క్రీడల నుండి ఇజ్రాయెల్‌ను నిషేధించడం ద్వారా ఒలింపిక్‌ కమిటీ తన గౌరవాన్ని, విశిష్టతను నిలబెట్టుకోవాలని పాలస్తీనా పౌర సమాజం కోరింది. అంతర్జాతీయ చట్టాలను కాలరాచి గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న, వర్ణ వివక్ష, జాతి నిర్మూలన చర్యలకు ఇంతవరకు 24,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు, ఇజ్రాయిల్‌ దాడిలో అమాయక పౌరులు, జర్నలిస్టులు, క్రీడాకారులు అనేక మంది చనిపోయారనిగాజాలోని పాలస్తీనా ఒలింపిక్‌ కమిటీ కార్యాలయాన్ని కూడా ధ్వంసంచేశాయని పాలస్తీనా ఒలింపిక్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ కోచ్‌, కెప్టెన్‌ హనీ అల్‌-మస్దర్‌ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష రాజ్యమేలినప్పుడు ఆ దేశాన్ని ఒలింపిక్స్‌తో సహా అన్ని అంతర్జాతీయ క్రీడా పోటీల నుంచి బహిష్కరించారు. ఇప్పుడు ఇజ్రాయిల్‌కు అదే సూత్రాన్ని వర్తింపజేయడంద్వారా ఐఒసి తన నిబద్ధతను చాటుకోవాలని పాలస్తీనా పౌర సమాజం కోరింది. ఇజ్రాయిల్‌ను ఒలింపిక్స్‌కు అనుమతించడమంటే అది సాగిస్తున్న వర్ణ వివక్ష, యుద్ధ నేరాలకు మద్దతు తెలపడమేనని పేర్కొంది.

➡️