పాముకాటుతో రైతు సంఘం మండల అధ్యక్షులు బగ్గి వెంకటేశ్వర్లు మృతి

Apr 7,2024 00:12

బగ్గి వెంకటేశ్వర్లు (ఫైల్‌)
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ :
పాము కాటుకు గురై పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల రైతు సంఘం అధ్యక్షులు బగ్గి వెంకటేశ్వర్లు (65) శనివారం మృతి చెందారు. మండలంలోని కందులువారిపాలేనికి చెందిన వెంకటేశ్వర్లు వేసవి నేపథ్యంలో తన ఇంటిపై వేసుకోవడానికి జమ్ముకోసమని ఊరికి సమీపంలోని ముడులకు మరొకర్ని తోడు తీసుకుని వెళ్లారు. జమ్ము కోస్తుండగా ఏదో కుట్టినట్లు అనిపించడంతో చూడగా పాము కనిపించింది. దీంతో వెంకటేశ్వర్లు పక్కనున్న వ్యక్తి వెంటనే కుటుంబీకులకు ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చారు. వారొచ్చి వెంకటేశ్వర్లును హుటాహుటిన సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యు లు నిర్థారించారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అంత్యక్రియలు ఆదివారం ఉదయం కందులవారిపాలెంలో నిర్వహి స్తామని, అనంతరం సంతాప సభ ఉంటుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి తెలిపారు.వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని లకీëశ్వరరెడ్డితోపాటు సిపిఎం మండల కార్యదర్శి పి.మహేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జె.భగత్‌, సిపిఎం కందులవారిపాలెం శాఖ కార్యదర్శి సిహెచ్‌.లక్ష్మీనారాయణ, నాయకులు ఎం.నరసింహారావు, వి.తులసీరామ్‌, ఆర్‌.పూర్ణచంద్రరావు, డి.మేరమ్మ, డి.నాగేశ్వరరావు అనూష, సుజాత, వీరబ్రహ్మం, తాతారావు, వెంకట్‌ నారాయణ, వెంకయ్య, సత్యవతి తదితరులు సందర్శించి పూలమాలలేసి నివాళులర్పించారు. భౌతికకాయంపై సిపిఎం జెండాను కప్పారు. ఈ సందర్భంగా ఎ.లకీëశ్వరరెడ్డి, పి.మహేష్‌ మాట్లాడుతూ సిద్ధాంతం కోసం ఎంతో అంకితభావంతో వెంకటేశ్వర్లు పని చేశారని, నీతి, నిజాయితీలతో వ్యవహరించడంతోపాటు కష్ట సమయాల్లోనూ పార్టీ కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ధైర్యంగా నిలబడ్డారని చెప్పారు. చదువుకున్నది తక్కువే అయినా రైతులు, వ్యవసాయ కార్మికులు సమస్యలపై పని చేయడంతో ప్రత్యేకత చూపేవారన్నారు. ప్రజలతో మమేకం కావడం, పార్టీ నిర్మాణంలో కీలకంగా పనిచేసిన ఆయనకు ప్రత్యేక స్థానముందని కొనియాడారు.

➡️