పిల్ల ఎలుక సాహసం!

Apr 21,2024 04:41 #feachers, #jeevana

పాల వ్యాపారం చేసే రంగయ్య ఇంటి నిండా ఎలుకలు ఎక్కువయ్యాయని భార్య పోరు పెడుతుంటే, ఒక పిల్లిని కూడా పెంచడం మొదలు పెట్టాడు. అయితే ఆ పిల్లి ఎలుకలను పట్టుకోకుండా పాలు తాగడం మొదలుపెట్టింది. పిల్లి పాల దగ్గరకి రాకుండా ఉండేందుకు రంగయ్య ఎప్పుడూ ఒక దుడ్డు కర్ర వెంట పట్టుకు తిరుగుతుండేవాడు. ఒకసారి ఎవరూ లేరనుకుని పాలగిన్నె మీద మూత తీయబోతున్న పిల్లిపై, తలుపు మూలన నక్కిఉన్న రంగయ్య దుడ్డు కర్రను విసిరాడు. అప్పటి నుండి పిల్లి పాల జోలికి వెళ్లడం మానేసింది. ఇక అప్పుడు దాని దృష్టి ఎలుకలపై పడింది. కనిపించినదాన్ని కనిపించినట్లు పట్టుకుని తినడం మొదలుపెట్టింది.
ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఆలోచించాలని ఎలుకలన్నీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. తమ సంతతి నశించిపోతుందని గ్రహించిన ఎలుకలన్నీ పిల్లితో ఒక ఒప్పందానికి వచ్చాయి. తమలో ఒక్కరం ప్రతి రాత్రి పిల్లికి ఆహారంగా వస్తామన్నది ఆ ఒప్పందం. రాత్రంతా మెలకువగా లేకుండా సమయానికి కావాల్సిన ఆహారం ముందుకు వస్తుందని పిల్లి తెగ సంతోషపడింది.
ఒప్పందం అయితే చేసుకున్నాయి కానీ ఎలుక సమూహానికి దిగులు పట్టుకుంది. తమకు తామే పిల్లికి ఆహారంగా వెళ్లడం వాటికి ససేమిరా ఇష్టం లేదు. తల్లి ఎలుకలన్నీ ఒక్కపెట్టున బోరున ఏడ్చాయి. అది చూసిన ఓ చిన్ని ఎలుక ‘ఈ లోకంలో బతికే హక్కు మాకూ ఉంది. ఆ పిల్లి ఆట నేను కట్టిస్తానమ్మ’ అని ప్రతిజ్ఞ చేసింది.
పిల్లికి కనిపించకుండా దాని దినచర్యను బాగా గమనించింది చిన్ని ఎలుక. రంగయ్య దుడ్డుకర్ర పక్కన పెట్టుకొని తిరగడం, పిల్లి అతని వంక భయం భయంగా చూడడం చిన్ని ఎలుకకు అనుమానమొచ్చింది. రంగయ్య కమ్మని నెయ్యి వడ్డించుకుని, వేడివేడి అన్నం తింటుంటే పిల్లి నెయ్యి గిన్నికేసి, పెరుగు ముంత కేసి ఆశగా చూస్తూ, మూతిని నాక్కోవడం గమనించింది.
ఆ క్షణమే చిన్ని ఎలుకకు ఒక ఉపాయం తోచింది. వెంటనే తల్లితో చెప్పింది. ఆ సాయంత్రం రంగయ్య పొలం నుంచి తిరిగి వచ్చి భోజనానికి కూర్చున్నాడు. యథాప్రకారంగా దుడ్డుకర్రని అతని పక్కనే ఉంది. సూరమ్మ వేడివేడి నెయ్య గిన్ని తీసుకుని వచ్చి పక్కన పెట్టి భర్తకి అన్నం వడ్డించసాగింది.
తల్లికి చెప్పిన ఉపాయం ప్రకారం చిన్ని ఎలుక పరిగెత్తుకొని వచ్చి నెయ్యి గిన్నె అంచుని ఒక్క తోపు తోసి చెంగున దూకి పారిపోయింది. అది చూసి రంగయ్య కోపంతో దుడ్డు కర్ర తీసుకొని ఎలుక పారిపోయిన వేపు విసిరేశాడు. సరిగ్గా ఆక్షణంలోనే ఎలుకను పట్టుకుందామని పిల్లి ఆ వైపు దూకింది. ఆ దుడ్డు కర్ర కాస్తా పిల్లికి తగిలి కుయ్యో మొర్రో అనుకుంటూ వెనక్కితిరిగి చూడకుండా పరుగెత్తింది. ఆ రోజు నుండి పిల్లి ఆ ఇంటి పరిసరాలకు రాలేదు.
ఆ పిల్లి పోయినా రంగయ్య మళ్లీ ఇంకో పిల్లిని తెస్తాడు. కాబట్టి ఆ ఇంటిని వదిలి పొలంలోకి వెళ్లిపోవాలని ఎలుకలన్నీ తీర్మానించుకున్నాయి. ఆ రోజు రాత్రే, పిల్లలతో సహా ఎలుక దంపతులన్నీ పొలాల వైపు సాగిపోయాయి.

– కొత్తపల్లి ఉదయబాబు,
95337 56075.

➡️