మాల్స్ లో స్టూల్స్ ఏర్పాటు

Jan 29,2024 16:59 #Kakinada, #shopping mall
baby rani on shopping malls workers problems

షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు సిఐటియు వినతి
పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను ఆదేశించిన కలెక్టర్

ప్రజాశక్తి-కాకినాడ : షాపింగ్ మాల్స్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి మాట్లాడుతూ కాకినాడ నగరంలో షాప్స్, మాల్స్ లో పెద్దసంఖ్యలో కార్మికులు, ముఖ్యంగా మహిళా కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. కేరళ, తమిళనాడు తరహాలో మాల్స్ లో పనిచేసే కార్మికులకు స్టూల్ ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా మహిళలకు వారాంతపు సెలవు ఖచ్చితంగా ఆదివారం అమలు చేసి పిల్లలతో గడిపే అవకాశం ఇవ్వాలన్నారు. షాప్స్, మాల్స్ యజమానులు వివిధ రకాల పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తారు కాబట్టి కార్మికులకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయించాలన్నారు. చట్ట ప్రకారం బోనస్ అమలు చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కార్మిక శాఖ అధికారులను పిలిచి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ కార్మిక శాఖ కమిషనర్ వై. బుల్లిరాణి మాట్లాడుతూ డిసిఎల్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ వారి ఆదేశాలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️