అన్ని వేళలా అందుబాటులో ఉంటా..

May 8,2024 21:10

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని విజయనగరం లోక్‌సభ టిడిపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం పార్లమెంట్‌ స్థానాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రైతులు, మత్స్యకారులు, నిరుద్యోగ యువతీయువకుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జిల్లాలోని మూతపడిన చక్కెర కర్మాగారాలు తెరింపించడంతో పాటు ఒడిదుడుకుల మధ్య ఉన్న ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలు బాగా నడిచే విధంగా కృషి చేస్తానన్నారు. మత్స్యకారుల భద్రత, అభివృద్ధి కోసం తీర ప్రాంతంలో ఫిషింగ్‌ హార్బర్‌ లేదా జట్టీలు, కోల్డ్‌ స్టోరేజీల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇటీవల తనను కలిసిన ప్రజాశక్తికి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటాల్లోనే…. విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో ఎక్కువగా రైతులు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, చదువుకున్న నిరుద్యోగ యువత ఎక్కువ మంది ఉన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా వీరందరి అభివృద్ధి, సంక్షేమం సాధ్యమౌతుందని గట్టిగా నమ్ముతున్నాను. యురవతోలో నైపుణ్యాన్ని మెరుగుపర్చడం ద్వారా పెద్ద ఎత్తును ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. అందుకు తగిన వనరులు కూడా నియోజకవర్గంలో ఉన్నాయి. సారవంతమైన భూములు ఉన్నాయి. పోలవరం పూర్తి అయ్యాక ఉత్తరాంధ్ర సృజల స్రవంతితో ఆండ్ర, తాటిపూడి, తోటపల్లి, తారకరామ తదితర జలాశయాలకు అనుసంధానం చేస్తే ప్రతి ఎకరా సస్యశ్యామలం అవుతుంది. ఇందుకోసం ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మూతపడ్డ భీమసింగి, లచ్చయ్యపేట చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించేందుకు కృషిచేస్తాను. ఏటా చెరకు మద్ధతు ధర పెంచేందుకు అనుగుణంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. మరోవైపు జిల్లాలోవున్న ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ రాయితీలు ఇచ్చే విధంగా ఒత్తిడిచేస్తాను. తద్వారా మన జిల్లాలో వేలాది మంది ఉద్యోగులు, కార్మికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. జిల్లాలోని పురాతమైన రైల్వే వంతెనలు, గేట్లు పుననిర్మించేందుకు కృషిచేస్తాను. మానాపురం, చీపురుపల్లిలో చేపట్టిన వంతెనల నిర్మాణం త్వరితగతీన పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తాను. చారిత్రిక విజయనగరం రైల్వేస్టేషను ప్రస్తుత పరిస్థితులు, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆఫీసులకు అనుసంధానంగా తన తరపున ప్రతినిధులను పెట్టి, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. పూర్వం నుంచీ ఉన్న బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌, కంటకాపల్లి, సారిపల్లి, విటి అగ్రహరం పారిశ్రమిక వాడల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు అవసరమైనంత భూమి ఉంది. వీటన్నింటినీ వినియోగంలోకి తెచ్చేందుకు కృషిచేయడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. టిడిపి అధికారంలోకి రాగానే విశాఖ కేంద్రంగా ఐటి పరిశ్రమలు కూడా వస్తాయి. ఎక్కడైనా అభివృద్ధిలో రోడ్డు, రవాణా అత్యంత కీలకంగా ఉంటాయి. ఈనేపథ్యంలో రారుపూర్‌ – విశాఖపట్నం గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి నిర్మాణ పనులు వేగవంతమయ్యే విధంగా కృషిచేస్తాను. గడిచిన ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ పనులు త్వరిత గతిన ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎచ్చెర్ల, రణస్థలం, భోగాపురం, పూసపాటిరేగ తీరంలో జట్టీలు, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించడం ద్వారా మత్స్యకారుల వలసలు నివారణకు కృషి చేస్తాను. తీరంలో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటుచేసి, వాటికి రహదారి సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంది. భోగాపురం ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టు పనులు శరవేగంగా పూర్తిచేయాలనే పట్టుదలతో టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు. అందుకు కేంద్రం తరపున సాయం తెచ్చేందుకు తన వంతు బాధ్యతలు నిర్వహిస్తాను.

➡️