Arunachal Pradesh : పోలింగ్‌ స్టేషన్‌లకు చాపర్‌లో బయల్దేరిన ఎన్నికల అధికారులు

ఈటానగర్‌ :    అరుణాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు రిమోట్‌ పోలింగ్‌ స్టేషన్లకు 40 మంది ఎన్నికల అధికారుల బృందం చాపర్‌లో బయలుదేరింది. రాష్ట్రానికి చెందిన స్కియాన్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహించే ఎంఐ-172 చాపర్‌లో వారిని క్రో దాడి జిల్లాలోని నాలుగు పోలింగ్‌ స్టేషన్లకు తరలించినట్లు చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి మంగళవారం తెలిపారు.   ఈ పోలింగ్‌ స్టేషన్లు చైనా సరిహద్దు జిల్లాకు సమీపంలో పిప్‌ సోరాంగ్‌ సర్కిల్‌లో ఉన్నాయని అన్నారు.

రాష్ట్రంలోని మొత్తం 2,226 పోలింగ్‌ స్టేషన్‌లలో కేవలం 228 పోలింగ్‌ స్టేషన్‌లకు మాత్రమే రోడ్డు మార్గంలో చేరుకునే అవకాశం ఉంది. వీటిలో 61 పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలంటే రెండు రోజుల పాటు నడవాల్సి వుండగా, మరో ఏడు బూత్‌లకు చేరుకోవాలంటే మూడు రోజుల పాటు నడవాల్సి వుంది.

మిగిలిన రిమోట్‌ పోలింగ్‌ స్టేషన్లకు వివిధ జిల్లాల నుండి అధికారులను తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎలక్టోరల్‌ ఆఫీసర్స్‌ (డిఇఒలు) ప్రకటించారు. ఒక్కో పోలింగ్‌స్టేషన్‌కి ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ఇద్దరు పోలింగ్‌ అధికారులు, పోలింగ్‌ అటెండెంట్‌ ఒకరు, సెక్యూరిటీ అధికారులు సహా మొత్తం పది మంది విధులు నిర్వహిస్తారు.

ఎన్నికల కోసం మొత్తంగా 11,130 పోలీంగ్‌ అధికారులను కేటాయించగా, 6,874 ఇవిఎంలను వినియోగించనున్నారు. 80 కంపెనీలకు చెందిన సెంట్రల్‌ ఆర్మ్డ్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ (సిఎపిఎఫ్‌)లను మోహరించారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని 50 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19న మొదటి దశలో పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను పది అసెంబ్లీ స్థానాల్లో బిజెపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాష్ట్రంలోని మొత్తం 8,92,694 మంది ఓటర్లలో 4,54,256 మంది మహిళలు 50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్న 143 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అలాగే రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్న 14 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

➡️