Paddy: నిలిచిన ధాన్యం చెల్లింపులు

  • రూ.815 కోట్లకుపైనే బకాయిలు 
  • ఆందోళనలో రైతాంగం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ధాన్యం సేకరణకు గాను ప్రభుత్వం రైతులకు చేయాల్సిన చెల్లింపులు నిలిచిపోయాయి. పౌరసరఫరాల శాఖ వద్ద అవసరమైన నిధులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ధాన్యం సేకరించిన 21 రోజుల్లో రైతుల అకౌంట్లలో నగదు జమ చేయాలి. అయితే, ఆచరణలో అలా జరగడం లేదు. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి చేసిన కొనుగోళ్లకు ఇంకా నగదు చెల్లించలేదు. ఇంకా రైతుల వద్ద నవంబరు నుంచి మార్చి మొదటి వారం వరకు ఇలా రైతులకు బకాయి పడిన మొత్తం రూ.815 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇంకా రైతుల వద్ద పెద్ద మొత్తంలో ధాన్యం నిలువలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికి సేకరించిన వాటికే నగదు చెల్లించకపోవడంతో, మిగిలిన ధాన్యాన్ని సేకరించే అంశం కూడా ప్రశ్నార్థకంగా మారింది.

అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ఏడాది 4,96,088 మంది రైతుల నుంచి 29,81,178.40 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటి విలువ రూ.6,514.27 కోట్లు ఉంటుందని అంచనా. ఈ మొత్తంలో ఇప్పటి వరకు రూ.5,698.93 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ.815.34 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని స్థితి నెలకొంది. దీంతో బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారా అనిరైతులు ఎదురుచూడక తప్పని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఖరీఫ్‌ ధాన్యం సేకరణ ప్రారంభంలో సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దళారీ వ్యవస్థ నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు, రైతు తూకాల్లో మిల్లర్ల నుంచి మోస పోకుండా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రూ.5 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఆ నిధులు అయిపోయాయని చెబుతున్నారు. అదనపు నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో రైతులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. రుణాలకు వడ్డీలు పెరుగుతున్నాయని, బిల్లుల చెల్లింపులు సకాలంలో జరగకపోతే రుణాలు భారంగా మారుతాయని అంటున్నారు.

  • తగ్గుతున్న సేకరణ

మరోవైపు ధాన్యం సేకరణ కూడా ఏడాదికేడాదికి తగ్గుతోంది. 2019-20వ సంవత్సరంలో 47.82 లక్షల మెట్రిక్‌ టన్నులను ప్రభుత్వం సేకరించగా, 2020-21లో 47.32 లక్షల టన్నులను సేకరించింది. 2021-22లో సేకరణ మొత్తం 40.31 లక్షల మెట్రిక్‌ టన్నులకు తగ్గింది. 2022-23లో ఈ మొత్తం 35.36 లక్షల మెట్రిక్‌ టన్నులకే పరిమితమైంది. 2023-24లో ఇప్పటి వరకు 29.81 లక్షల మెట్రిక్‌ టన్నులనే సేకరించింది. మరో 1 లేదా 2 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించే అవకాశం ఉందని సమాచారం.

ధాన్యం లెక్కలు ఇలా…

మొత్తం సేకరణ (మెట్రిక్‌ టన్నుల్లో) : 29,81,178.40

రైతుల సంఖ్య : 4,96,088

సేకరించిన ధాన్యం విలువ (రూ.కోట్లలో) : 6,514.27

చెల్లించిన మొత్తం (రూ.కోట్లలో) : 5,698.93

ఇంకా చెల్లించవలసింది (రూ. కోట్లలో) : 815.34

➡️