ప్రజా వ్యతిరేక పార్టీలను ఓడించాలి

రాష్ట్రానికి ద్రోహం

ర్యాలీగా వెళ్తున్న సిపిఎం, ఇండియా ఫోరం నాయకులు

  • సిపిఎం రాష్ట్ర నాయకులు
  • సిహెచ్‌.నర్సింగరావు

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి, ఆ పార్టీతో పొత్తు పెట్టకున్న టిడిపి, జనసేన పార్టీలు, తొత్తుగా వ్యవహరిస్తున్న వైసిపిని ఈ ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్‌.నర్సింగరావు పిలుపునిచ్చారు. మండలంలోని చిలకపాలెంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, ఫెడరల్‌ వ్యవస్థను పథకం ప్రకారం బిజెపి ధ్వంసం చేస్తోందని, పౌర హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. బిఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, రోడ్లు, పోర్టు, విద్యుత్‌, ఆయిల్‌ సెక్టార్‌, రైల్వే తదితర ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసిందన్నారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సంపాదించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా బిజెపి ప్రభుత్వం చేసిందని విమర్శించారు. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు సరే కదా భూములు అంబానీ, అదానీకి అప్పగించేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని, ఇండియా ఫోరం బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి కరిమజ్జి మల్లేశ్వరరావును గెలిపించాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభ అనంతరం అంబేద్కర్‌ విగ్రహం నుంచి చిలకపాలెం జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.తేజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, నాయకులు సిహెచ్‌.అమ్మనాయుడు, తోనంగి నందోడు, ఎన్‌.వి రమణ, పి.దుర్గాప్రసాద్‌, వెలమల రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️