రైతు వ్యతిరేక బడ్జెట్‌ : ఎఐకెఎస్‌ విమర్శ

Feb 2,2024 10:46 #AIKS, #Anti-farmer, #Budget, #criticism

న్యూఢిల్లీ : సి2 ప్లస్‌ 50శాతంతో కనీస మద్దతుధరను ఇచ్చేందుకు చట్టపరమైన హామీ కల్పిస్తూ బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) తీవ్రంగా విమర్శించింది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామంటూ ఇచ్చిన హామీలు కేవలం ప్రహసనంగా మారాయని విమర్శించింది. మోడీ ప్రభుత్వం వరుసగా పదోసారి రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ సమర్పించిందని ఎఐకెఎస్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజూ కృష్ణన్‌, డాక్టర్‌ అశోక్‌ ధావలె విమర్శించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా చేసిందేమీ లేదన్నారు. 2022-23తో పోలిస్తే 2024-25లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు చేసిన కేటా యింపులు ఏకంగా రూ.81 వేల కోట్ల మేరకు తగ్గాయ ని విమర్శించారు. చిన్న కమతాల వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకే మోడీ సర్కార్‌ ప్రయత్ని స్తోందన్నారు. ఎరువులు, ఆహార సబ్సిడీలు గతంతో పోలిస్తే పెద్ద మొత్తంలో తగ్గాయన్నారు. కీలక రంగాల్లో చేసిన కేటాయింపులు చూస్తేనే మోడీ ప్రభుత్వ వైఖరి ఎలా వుందో అర్థమవుతోందన్నారు. అభివృద్ధి చెందా ల్సింది రైతులు కాదు, అదానీ, అంబానీలన్న విషయాన్ని ఈ ప్రభుత్వం తన చర్యలతో స్పష్టం చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో 16వ తేదీ గ్రామీణ బంద్‌ను జయప్రదం చేసేందుకు కృషి చేయాల్సిందిగా ఎఐకెఎస్‌ తన శాఖలకు పిలుపునిచ్చింది.

➡️