బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కావాలి

Jan 1,2024 11:23 #cpm, #India Forum
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో   :    బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ఓ హోటల్‌లో నిర్వహించిన సమాలోచన సమావేశంలో ఆయన మాట్లాడారు. భావ సారూప్యత కలిగిన పార్టీల నాయకులు ఒకే తాటిపైకి వచ్చి బిజెపితోపాటు దీనికి మద్దతు ఇచ్చే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇండియా వేదికకు నేతృత్వం వహించే కాంగ్రెస్‌ పార్టీ సారథి బాధ్యతతో ముందుకు నడవాలని తెలిపారు. మోడీ ప్రభుత్వ హయాంలో సమాజిక న్యాయం అనేది లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్‌ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర బిజెపితో అంటకాగుతున్నాయన్నారు. జనవరి 12న రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో 2 వేల మందితో భారీ సదస్సు నిర్వహించనున్నామని, అందరూ హాజరుకావాలని కోరారు. పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. బిజెపి భావజాలానికి, జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రజాస్వామ్య వాదులు కలిసి సమాలోచన సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో బిజెపి, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం హక్కులను హరిస్తున్నాయన్నారు. దళితులపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ.. భావ సారూత్యప కలిగిన రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి కేంద్రంలో బిజెపిని ఓడించాలన్నారు. అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తలు బిజెపి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని విమర్శించారు. ఎఐసిసి కార్యదర్శి జెడి శీలం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిన బడుగు, బలహీనవర్గాల ప్రజలు తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. జనవరి 2 నుంచి 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బడుగు, బలహీన, క్రిస్టియన్‌ సమస్యలపై జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

➡️