జిల్లా పోలీసు కార్యాలయంలో వార్షిక తనిఖీలు

Dec 20,2023 16:21 #Kakinada
annual audit in district office

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ వివిధ విభాగాలలో వార్షిక తనిఖీలను ఏలూరు రేంజ్ డీఐజీ జివిజి అశోక్ కుమార్ బుధవారం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసిన డిఐజికి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ఈ వార్షిక తనిఖీలలో డిఐజి జిల్లా పోలీసు కార్యాలయ వివిధ పరిపాలన విభాగాలలో వార్షిక ప్రగతిని పరిశీలించి తనిఖీ చేయడం జరిగింది. జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి శివరామరాజు, సంబంధిత విభాగాల మినిస్టీరియల్ సిబ్బంది వారి విభాగాల వారీగా సమర్పించిన వార్షిక ప్రగతి నివేదికలను ఏలూరు రేంజ్ డీఐజీ క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. రానున్న ఎన్నికల దృష్ట్యా ఎన్నికల బందొబస్తు నిర్వహించే జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది యొక్క సంక్షేమం, ఇతర విధి నిర్వహణ అవసరాల నిమిత్తం సకాలంలో స్పందించేలా సంసిద్ధంగా ఉండాలని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి, వారి బృందానికి సూచించారు. డిసిఆర్బి, డిటిఆర్బి, స్పెషల్ బ్రాంచ్ కీలక విభాగాల అధికారులు, సిబ్బంది సమర్పించిన వార్షిక పనితీరు నివేదికలను డిఐజి పరిశీలన చేసి రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకుని జిల్లా పోలీసు కార్యాలయం నుండి సకాలంలో ఎన్నికల సంబంధిత సమాచారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి ఇతర ఎన్నికల సంబంధిత ఉన్నతాధికారులకు అందించేలా సంసిద్ధంగా వుండాలని అందుకు అనుగుణంగా పోలీసు స్టేషన్ స్థాయినుండి రావాల్సిన సమాచార సేకరణకై క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహనను కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో వున్న కమాండ్ కంట్రోల్ విభాగ పనితీరును డిఐజి పరిశీలించి జిల్లాలో వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షణ జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా వీక్షించగా డిఎస్పీ చవ్వాకుల రామకోటేశ్వరరావు డిఐజికి వివరించడం జరిగింది. జిల్లా పోలీసు కార్యాలయ భవనంలో వున్న జిమ్నాసియం ను పరిశీలించి నిర్వహణ తీరు బాగుందని ప్రస్తుత ప్రమాణాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ పోలీసు అధికారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించు కోవాలని డిఐజి ఆకాంక్షించారు. డిఐజి జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగ అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు సిబ్బందిచే ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ హరిరావు పరేడ్ కమాండర్ గా వుండి నిర్వహించబడిన పరేడ్ కు ముఖ్య అతిధిగా హాజరు కాగా ఈ సాయుధ బలగాల కవాతును వీక్షించి వారు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం డిఐజి పాత జిల్లా పోలీసు కార్యాలయ ప్రాగణంలో నిర్వహించబడుతున్న వివిధ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగాలను పరిశీలించిన తరుణంలో వార్షిక పనితీరును ఆర్మ్డ్ రిజర్వ్ డిఎస్పీ వెంకట అప్పారావు వివరించగా డిఐజి పరిశీలించారు. ఆయుధాగారం, పోలీసు జాగిలాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ల నిర్వహణ తీరును సిబ్బందిని అడిగి స్వయంగా డిఐజి పరిశీలించడం జరిగింది. వార్షిక తనిఖీల్లో ఏలూరు రేంజ్ డిఐజితో కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, ఎస్పీ పి శ్రీనివాస్, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ, జిల్లా పోలీసు కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివరామ రాజు, డిఎస్పీ వెంకట అప్పారావు, డిఎస్పి చవ్వాకుల శ్రీ రామ కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు పి ఈశ్వరుడు, పి శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీహరి రావు, అప్పారావు, జిల్లా పోలీసు కార్యాలయ, ఆర్మ్డ్ రిజర్వ్ వివిధ విభాగాల మినిస్టీరియల్ , పోలీసు సిబ్బంది ఉన్నారు.

➡️