సెనెగల్‌ అధ్యక్ష ఎన్నికల వాయిదాపై పెల్లుబికిన ఆగ్రహం

angry on senegal presidential elections

దకర్‌ : సెనెగల్‌ అధ్యక్ష ఎన్నికలను ఈ ఏడాది డిసెంబరు 15కి వాయిదా వేస్తూ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేషనల్‌ అసెంబ్లీ డిప్యూటీలు ఓటు వేయడంపై ఆ దేశంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఇది రాజ్యాంగ కుట్ర అంటూ పౌర సమాజం, రాజకీయ సంస్థలు తీవ్రంగా నిరసించాయి. సోమవారం పార్లమెంట్‌ సమావేశమైనపుడు, అధ్యక్షుడు మాకీ సాల్‌ నియంత అంటూ ఆందోళనకారులు పార్లమెంట్‌ వెలుపల నినాదాలు చేశారు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నిక జరపాలంటూ డిమాండ్‌ చేశారు. దాంతో నిరసనకారులపై బాష్పవాయు గోళాలతో పోలీసులు విరుచుకుపడ్డారు. రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేశారు. శాంతియుతమైన, ప్రజాస్వామిక దేశమైన సెనెగల్‌లో ఈ అధ్యక్షుడు తమకు న్యాయం, స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఆందోళనకారుడు వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికను కేవలం రాజ్యాంగ మండలి మాత్రమే వాయిదా వేయగలదని పేర్కొన్నారు. అలా వాయిదా వేయడంపై కూడా అనేక నియంత్రణలు వున్నాయి. అటువంటి కీలకమైన విషయంలో చర్యలు తీసుకున్న తీరు పూర్తి రాజ్యాంగ విరుద్దమని విమర్శించారు. ఇది రాజ్యాంగ కుట్ర కిందకే వస్తుందని తెలిపారు. నేషనల్‌ అసెంబ్లీ నుండి ప్రతిపక్షాల డిప్యూటీలను పోలీసులు బలవంతంగా తొలగించిన తర్వాత ఓటింగ్‌ జరిగింది. అధ్యక్ష ఎన్నికను వాయిదా వేయడానికి అనుకూలంగా 105 మంది ఎంపీలు ఓటు వేయగా, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. ఇక తన వారసుడిని ఎంపిక చేసుకునే వరకు ప్రస్తుత అధ్యక్షులు మాకీ సాల్‌ అధికారంలో కొనసాగుతారు. వాస్తవానికి ఏప్రిల్‌ 2తో ఆయన పదవీకాలం ముగియనుంది. తొలుత ఫిబ్రవరి 25న జరగాల్సిన ఈ ఎన్నికను నిరవధికంగా నిలుపు చేస్తున్నట్లు ఫిబ్రవరి 3న ప్రకటించారు. తిరిగి 5వ తేదీన పార్లమెంట్‌ నుండి ప్రతిపక్ష సభ్యులను బలవంతంగా తొలగించిన తర్వాత డిసెంబరు 15కి ఎన్నికలను వాయిదా వేస్తూ పార్లమెంట్‌ ఓటు వేసింది.

➡️