రాష్ట్రంలో అరాచక పాలన : పవన్‌కల్యాణ్‌

Nov 25,2023 10:00 #Andhra Pradesh, #pawan kalyan

 

శ్రీ హార్బర్‌ అగ్నిప్రమాద బాధితులకు జనసేన ఆర్థిక సాయం

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : నాలుగేళ్లుగా రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోందని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఏడాదిగా ఫిషింగ్‌ హార్బర్‌లో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 49 మంది మత్స్యకారులకు జనసేన పార్టీ ప్రకటించిన ఒక్కొక్కరికీ రూ.50 వేల ఆర్థిక సాయాన్ని పవన్‌కల్యాణ్‌ శుక్రవారం అందజేశారు. మత్స్యకారులకు భరోసా పేరుతో జనసేన ఆధ్వర్యంలో ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోవడం బాధాకరమన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఎపిలో జెట్టీల నిర్మాణం జరగలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే మెరైన్‌ పోలీస్‌ వ్యవస్థను, హార్బర్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ద్వారా ప్రతి ఏటా రూ.16 వేల కోట్లు ఆదాయం లభిస్తోందని తెలిపారు. తమకు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని బలంగా ముందుకు వెళ్తామన్నారు. వైసిపిని ఓడించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా తాము వదులుకోవడానికి సిద్ధంగా లేమని తెలిపారు. తొలుత విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా పవన్‌ ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించారు.అడుగడుగునా అడ్డంకులు : నాదెండ్ల మనోహర్‌తమ విశాఖ పర్యటనను అడుగడుగునా అడ్డుకునేందుకు వైసిపి కుట్రలు పన్నిందని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌ అరోపించారు. మధ్యాహ్నం తాము రావాల్సిన విమానాన్ని రద్దు చేయించారని, రెండు రోజుల క్రితమే రావాల్సి ఉన్న అనుమతులను తుది వరకూ నిరాకరించారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పంచకర్ల రమేష్‌ బాబు, కోన తాతారావు, పసుపులేటి ఉషాకిరణ్‌, బొడ్డేపల్లి రఘు, పీతల మూర్తి యాదవ్‌ పాల్గొన్నారు.

➡️