కరెన్సీల్లో కువైట్‌ దినార్‌ టాప్‌15వ ర్యాంక్‌లో రూపాయి

Jan 17,2024 21:12 #Business
  • ఫోర్బ్స్‌ బలమైన కరెన్సీల జాబితా వెల్లడి

న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల జాబితాలను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఇందులో కువైటీ దినార్‌ అత్యధిక విలువతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఒక్క దినార్‌ విలువ భారత కరెన్సీలో రూ.270.23కు (3.25 డాలర్లు) సమానంగా ఉండటం విశేషం. 2024 జనవరి 10 నాటికి ఉన్న విలువల ఆధారంగా ఫోర్బ్స్‌ ఈ జాబితాను రూపొందించింది. భారత కరెన్సీ రూపాయి 15వ స్థానంలో ఉంది. ఒక్క డాలర్‌కు రూ.82.9 సమానంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ 5వ స్థానంలో ఉందని పాలక వర్గాలు గొప్పగా చెబుతున్నప్పటికీ రూపాయి విలువ మాత్రం రెండంకెల స్థాయి ర్యాంకింగ్‌లో ఉండటం గమనార్హం. బహ్రెయినీ దినార్‌ రూ.220.4 (2.65 డాలర్లు)తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుస స్థానాల్లో ఒమన్‌ రియాల్‌ (రూ.215.84 లేదా 2.60 డాలర్లు), జోర్డాన్‌ దినార్‌ (రూ.117.10 లేదా 1.141 డాలర్లు), జిబ్రాల్డర్‌ పౌండ్‌ (రూ.105.52 లేదా 1.27 డాలర్లు), బ్రిటిష్‌ పౌండ్‌ (రూ.105.54 లేదా 1.27 డాలర్లు), కేమన్‌ దీవుల డాలర్‌ (రూ.99.76 లేదా 1.20 డాలర్లు), స్విస్‌ ఫ్రాంక్‌ (రూ.97.54 లేదా 1.17 డాలర్లు), యూరో (రూ.90.80 లేదా 1.09 డాలర్లు), అమెరికన్‌ డాలర్‌ (రూ.82.9)గా ఉన్నాయి. 1960 నుంచి కూడా కువైటీ దినార్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోంది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం వల్లనే కువైట్‌ దినార్‌ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోందని తెలిసింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని 180 కరెన్సీలను అధికారికంగా గుర్తించింది. ఆయా దేశాల ఎగుమతులు, దిగుమతులు, ఫారెక్స్‌ రిజర్వ్‌లు, బంగారు నిల్వలు, రోజువారీ వాణిజ్యం ఆధారంగా నిత్యం కరెన్సీ విలువ మారుతోంది. ఈ జాబితాలో అమెరికా డాలర్‌ పదో స్థానంలో ఉండడం గమనార్హం.

➡️