గ్రామీణ బంద్‌కు మద్దుతు ఇవ్వండి

  • ప్రజలకు రైతు, కార్మిక ఐక్య వేదిక పిలుపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఈ నెల 26న జరిగే ట్రాక్టర్‌ కవాతు, ఫిబ్రవరి 16న కార్మిక సమ్మె, గ్రామీణ బంద్‌కు మద్దతు ఇవ్వాలని దేశ ప్రజలకు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం), కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక విజ్ఞప్తి చేసింది. ఎస్‌కెఎం, కార్మిక సంఘాలు బుధవారం నాడిక్కడ ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. జీవనోపాధి సమస్యలను తిరిగి జాతీయ ఎజెండాలోకి తీసుకురావడానికి మద్దతుగా ఉండాలని విద్యార్థులు, యువత, మహిళలు, చిరు వ్యాపారులు, జర్నలిస్టులు, సాంస్కృతిక కార్యకర్తలకు ఎస్‌కెఎం, కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌, జనవరి 26 జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్‌, వాహన కవాతుకు ఎస్‌కెఎం ఇచ్చిన పిలుపునకు కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్‌లు, అసోసియేషన్లు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి.

”మోడీ ప్రభుత్వంలో ప్రజలపై కార్పొరేట్‌, మతతత్వ శక్తుల నిరంకుశ దాడి అంతకంతకూ తీవ్రతరమవుతున్న ఈ పరిస్థితుల్లో రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికవాదం, సోషలిజం వంటి ప్రాథమిక సూత్రాల పరిరక్షణకు ప్రజల విస్తృత ఐక్యత అనివార్యం. కాబట్టి, కార్పొరేట్‌ దోపిడీని అంతం చేసి రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా సెక్యులర్‌ డెమోక్రటిక్‌ క్యారెక్టర్‌ను కాపాడటానికి మద్దతు ఇవ్వాలని అన్ని లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు అభ్యర్థిస్తున్నాం’ అని ఆ ప్రకటన పేర్కొంది.

” ప్రజల నిజమైన జీవనోపాధి సమస్యలను తిరిగి జాతీయ ఎజెండాలోకి తీసుకురావాలి. విధ్వంసక-విభజన ఎజెండాను ప్రతిఘటించాలి. దానిని నిర్ణయాత్మకంగా ఓడించడానికి ప్రజలన పెద్దయెత్తున సమీకరించాలని ఆ ప్రకటన పేర్కొంది.”

స్వామినాథన్‌ సిఫారసులకనుగుణంగా అన్ని పంటలకు సి2 ప్లస్‌ 50 శాతం అన్న ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధర గ్యారంటీ చేస్తూ చట్టం తేవాలని, రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటనతో ప్రమేయమున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను తొలగించాలని, ఆయనపై హత్య కేసు నమోదు చేయాలని, సమగ్ర రుణమాఫీ చేయాలని, కార్మికులకు నెలకు రూ. 26 వేలు కనీస వేతనం ఇవ్వాలని. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని. ప్రాథమిక హక్కుగా ఉపాధి హామీని చేయాలని, . పాత పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరించాలని, రైల్వే, రక్షణ, విద్యుత్‌ సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని,. ఉద్యోగాల్లో కాంట్రాక్టీకరణ రద్దు చేయాలని, ఒక వ్యక్తికి రోజుకు రూ. 600 వేతనంతో ఏడాదికి 200 రోజుల పనితో ఉపాధి హామీని బలోపేతం చేయాలని. సంఘటిత, అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో అందరికీ పెన్షన్‌ , సామాజిక భద్రత కల్పించాలని, కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్‌)లో సెక్షన్‌ 104 రద్దు చేయాలని, భూసేకరణ పరిహారం, పునరావాసం (ఎల్‌ఎఆర్‌ఆర్‌) చట్టం-2013 అమలు చేయాలని ఆ ఉమ్మడి ప్రకటన డిమాండ్‌ చేసింది. ఈ డిమాండ్లు సాధించేవరకు ఉమ్మడి పోరాటం కొనసాగుతుందని అది స్పష్టం చేసింది.

➡️