ఎఐఎడిఎంకె-బిజెపి మధ్య రహస్య పొత్తు: స్టాలిన్‌

చెన్నై : ఎఐఎడిఎంకె-బిజెపి మధ్య రహస్య పొత్తు ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె నాయకులు ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. ఈ రెండు పార్టీలను ఓడించడానికి ఇండియా వేదిక కృషి చేస్తోందని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనే కాదు, ఏ ఎన్నికలు వచ్చినా ఇండియా కూటమిదే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. పొల్లాచ్చిలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కొంగు ప్రాంతాన్ని తమ కంచుకోటగా ఎఐఎడిఎంకె గొప్పగా ప్రచారం చేసుకుంటుందని, కానీ ఈ ప్రాంతానికి ఆ పార్టీ ఏమీ చేయలేదని స్టాలిన్‌ విమర్శించారు. పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసును అప్పటి ఎఐఎడిఎంకె ప్రభుత్వం నీరుగార్చిందని, 13 మంది ప్రాణాలు కోల్పోయిన తూత్తుకుడి కాల్పుల ఘటన ఎఐఎడిఎంకె ప్రభుత్వ హాయంలోనే జరిగాయన్నారు. అలాగే తమిళనాడు ప్రజలకు మోడీ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని, హామీలతోనే మోడీ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. మదురైలో ఎయిమ్స్‌ ఆసుపత్రి ఏర్పాటుపై హామీని కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. వచ్చే వారంలో తమిళనాడు పర్యటనకు రానున్న ప్రధాని మోడీని ఈ హామీలపై ప్రశ్నించాలని ప్రజలకు స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 57,325 మంది లబ్దిదారులకు సంక్షేమ సహాయాన్ని స్టాలిన్‌ పంపిణీ చేశారు. కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, ఈరోడ్‌, నీలగిరి జిల్లాల్లో చేపట్టే రూ. 1,273.51 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు స్టాలిన్‌ శంకుస్థాపన చేశారు.

➡️