ఎజెండా సెట్టింగ్‌…

Jan 30,2024 07:20 #Editorial

               పాత పెన్షన్‌ స్కీం (ఒపిఎస్‌)ను పునరుద్ధరించే పార్టీలకే ఓటేస్తామని ఉపాధ్యాయ, ఉద్యోగులు ప్రతిన బూనడం స్వాగతించదగింది. మాటలతో మభ్యపెడతామంటే కుదరదు, మేనిఫెస్టోలో చేర్చి, అధికారం చేపట్టగానే తొలి సంతకం పెడతామని ప్రకటించాలని కోరడం మంచిదే. ఒపిఎస్‌పై వైఖరేంటో రాజకీయ పక్షాలు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. స్పందించకపోతే అసెంబ్లీకి తమ ప్రతినిధులను పంపడానికి సిద్ధపడతామని హెచ్చరించారు కూడా. ఒపిఎస్‌పై ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులు ఆదివారం రాజమండ్రిలో భారీ బహిరంగసభ పెట్టుకున్నారు. ఆ సభకు వెళ్లనీకుండా సర్కారు అడ్డుకున్నప్పటికీ వేలాదిగా తరలి రావడం విశేషం. భవిష్యత్‌ కార్యాచరణ సభాముఖంగా ప్రకటించారు. ఒపిఎస్‌ కోసం ఇప్పటి వరకు నిర్వహించిన పోరాటాలు ఒక ఎత్తు కాగా ఎన్నికల ముంగిట పార్టీలపై ఒత్తిడి కోసం చేపట్టిన పోరాటాలు మరొక ఎత్తు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి చివరి వరకు కార్యక్రమాల ఎజెండా పార్టీల ముందుంచారు. ఇక తేల్చుకోవాల్సింది పార్టీలే.

కేంద్రంలో 2003లో బిజెపి సర్కారు ఉద్యోగులకు ఒపిఎస్‌ స్థానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సిపిఎస్‌) చట్టం వచ్చింది. వామపక్షాలు మాత్రమే వ్యతిరేకించగా దాదాపు అన్ని పార్టీలూ సమర్ధించాయి. 2004 జనవరి నుంచి వాజ్‌పేయి ప్రభుత్వం కేంద్రంలో సిపిఎస్‌ అమలు చేయగా, అదే ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఉమ్మడి ఎ.పి లో వైఎస్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు ప్రారంభించింది. కాలక్రమేణ సిపిఎస్‌ అన్యాయాన్ని అనుభవ పూర్వకంగా అర్థం చేసుకున్న ఉద్యోగులు ఆ స్కీం రద్దుకు ఉద్యమాలు చేస్తున్నారు. సిపిఎస్‌ రద్దు కోసం 2019 ఎన్నికలకు ముందు మన రాష్ట్రంలో పెద్ద పోరాటం జరగ్గా టిడిపి ప్రభుత్వం కమిటీ పేరిట మభ్యపెట్టి తక్కువ పింఛన్‌ ప్రతిపాదించగా తిరస్కరించారు. పాదయాత్రలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌, తామొస్తే వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తామన్నారు. ఉద్యోగుల పలు ఆందోళనల అనంతరం, అదీ అధికారంలోకొచ్చిన నాలుగేళ్లకు సిపిఎస్‌ కుదరదని, ప్రత్యామ్నాయంగా గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం (జిపిఎస్‌) అన్నారు. సిపిఎస్‌, జిపిఎస్‌ దాదాపు ఒకటే. మరోవైపు మోడీ ప్రభుత్వం సిపిఎస్‌ రద్దు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని పార్లమెంట్‌లో తెగేసి చెప్పింది. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఒపిఎస్‌ కోసం ఉద్యమ బాట పట్టారు. మాయ మాటలతో మోసం చేస్తున్న పార్టీలను నిలదీసేందుకు ఎన్నికలకు ముందు వారు ఎంచుకున్న పోరాట మార్గం సహేతుకమైనది. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. పార్టీల అసలు రంగు బయట పడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వంలో 11 లక్షల మంది వరకు పని చేస్తుండగా ఐదున్నర లక్షల మందే ప్రభుత్వ ఉద్యోగులు. మిగతా సగం కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌. సర్కారీ కొలువుల్లోని మూడు లక్షల మంది సిపిఎస్‌ పరిధిలో ఉన్నారు. సిపిఎస్‌కు ఒపిఎస్‌కు మధ్య భారీ తేడా ఉంది. ఒపిఎస్‌లో రిటైరయ్యే సమయానికి ఉద్యోగికి ఉన్న జీతంలో దాదాపు సగం పెన్షన్‌ వస్తుంది. అదే సిపిఎస్‌లో అయితే ఎంత సీనియర్‌ ఉద్యోగికైనా గరిష్టంగా వచ్చేది రూ.7 వేలు. పైపెచ్చు సర్వీస్‌లో చనిపోతే ఒపిఎస్‌లో మాదిరి పెన్షన్‌. రిటైరయ్యాక బతికుంటే నామమాత్రపు పెన్షన్‌. ఈ అన్యాయంపైనే ఉద్యోగులు ఎలుగెత్తారు. సిపిఎస్‌, జిపిఎస్‌ కాదు తమకు ఒపిఎస్‌ కావాలంటున్నారు. సమాజానికి 30 నుంచి 40 ఏళ్లు సేవ చేసి రిటైరయ్యాక కనీస బతుకు బతికేందుకు ఉద్యోగులకు ఉన్న కనీస భరోసాను తొలగించడం దారుణం. ఉద్యోగుల ఆందోళనలతో పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, హిమాచల్‌లో సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌కు వెళ్లారు. కేరళ, కర్ణాటక, అసోం, తమిళనాడు, తెలంగాణ ఆ దిశగా కసరత్తు చేస్తున్నాయి. సిపిఎస్‌ రద్దు హామీ ఇచ్చిన ఇక్కడి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం సాకు వెతికి తన ఉద్యోగ వ్యతిరేకతను చెప్పకనే చెప్పినట్లయింది. ఉద్యోగులకు పెన్షన్‌ భిక్ష కాదు హక్కు. ప్రభుత్వంలో కొన్ని దశాబ్దాలపాటు చేసిన సేవకు ప్రతిఫలం. సామాజిక భద్రత. సుప్రీం కోర్టూ ఇదే నొక్కివక్కాణించింది. ప్రభుత్వాలు ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ ప్రభావంతో పెన్షన్‌ను రాజకీయ, ఆర్థిక కోణంలో చూస్తున్నాయి. ‘ఒపిఎస్‌ ఇచ్చే పార్టీలకే ఓటు’ ఉద్యమానికి ప్రజలను విస్తృతంగా సమీకరించాలి. పౌర సమాజం ఆ పోరాటానికి మద్దతు తెలపాలి.

➡️