పెంపకంలో వయస్సు ప్రధానం..

Mar 31,2024 07:57 #Parenting, #Sneha

పిల్లల పెంపకం అంటే ఈ రోజుల్లో అంత ఆషామాషీ కాదు. ఓ రకంగా కత్తి మీద సామే. ముద్దుగా గారాబంగా పెంచే తల్లిదండ్రులు ఉంటారు. అయితే పిల్లలు దీనివల్ల మాట వినకుండా అయిపోతున్నారని.. కొందరు మిలట్రీ క్రమశిక్షణ అమలు చేస్తుంటారు. దాంతో పిల్లలు తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావం వ్యక్తపరుస్తుంటారు. ఇంకొందరు పిల్లల్ని కొట్టి, తిట్టి భయభక్తుల్లో ఉండాలని పెంచుతారు. వీళ్లు మొండిఘటాల్లా తయారవుతారు. అందుకే పిల్లల పెంపకం చాలా కష్టసాధ్యమైనదని చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నట్లు అధ్యయనాల్లో కూడా తేలింది. అయితే పిల్లలు బంకమట్టి లాంటివారు. వారిని మలిచే కళ పేరెంట్స్‌ నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అది కూడా ఒకరకంగా సృజనతో కూడుకున్నదే. పిల్లల పెంపకం గురించి అంతలా వర్రీ అవ్వొద్దనీ, ఏ వయసులో ఎలా చెబితే పిల్లలు తీర్చిదిద్దబడతారో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

పిల్లలు కాకపోతే ఎవరు అల్లరి చేస్తారు. పిల్లల సందడి ఇంటికే వన్నె తెస్తుంది. అయితే పిల్లల పెంపకం మాత్రం తల్లిదండ్రులదే బాధ్యత. పునాది బాగుంటేనే భవిష్యత్తు బంగారంలా ఉండేది. అందుకే పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో అనే విషయంలో స్పష్టత ఉండాలి.

పసితనంపై ప్రేమగా..
పిల్లలు పసి వయసులో ఉన్నప్పుడు ముద్దు ముద్దుగా మాట్లాడతారు. ఏ తల్లిదండ్రులైనా వారి మాటలకు, చేష్టలకు ఫిదా అయిపోతారు. అందుకే ఐదేళ్ల వరకూ పిల్లల్ని ప్రేమగా, లాలనగానే చూడాలి. వారిని ఒక రకంగా గారాబం చేయాల్సిన వయస్సు ఇది మాత్రమే. ఈ వయస్సులో పిల్లల ఆటపాటలు, ముద్దు మురిపాలు వాళ్లతో పాటూ తల్లిదండ్రులూ ఎంజారు చేస్తారు.. చేయాలి కూడా. అందుకే ఈ వయస్సులో పిల్లలకు పంచాల్సింది ప్రేమ. ఈ వయస్సు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలని చూసినా, కొట్టినా, తిట్టినా మొండిగా తయారవుతారనేది నిపుణుల మాట.

మంచి.. చెడు విచక్షణ నేర్పాలి..
పిల్లలు ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల వరకూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు మంచి-చెడు తెలుసుకోవడం నేర్పాల్సిందే. ఈ వయస్సులో పిల్లలు తమ చుట్టూ జరిగేవన్నీ గమనిస్తూ ఉంటారు. అంతేకాదు.. వాటిని ఆచరించడానికీ ప్రయత్నిస్తారు. అందుకే ఈ వయస్సు పిల్లల ముందు పెద్దలు కూడా కాస్తంతా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎలాబడితే అలా మాట్లాడితే.. పిల్లలు కూడా ఆ మాటలు నోట్‌ చేసుకుంటారు. వాళ్లు ఎక్కడో దగ్గర ఆ మాటలను ప్రయోగిస్తారు. అలాగే తల్లిదండ్రులు వ్యవహరించే తీరును కూడా ఈ వయస్సు పిల్లలు నిశితంగా గమనిస్తారు. అలాంటప్పుడు మాట అయినా, ప్రవర్తన అయినా సరిగా ఉండాలి. లేకపోతే పిల్లలూ ఆ విధంగానే వ్యవహరిస్తారనేది నిపుణులు చెప్తున్న మాట. పిల్లలు ముందు మాట్లాడేప్పుడు బాగా ఆలోచించాలి.. అలాగే ఆచితూచి వ్యవహరించాలంటున్నారు నిపుణులు.

యవ్వనంలో.. స్నేహంగా..
పిల్లలు టీనేజ్‌కి వచ్చాక అజమాయిషీ చేయాలనీ, ఆధిపత్యం ప్రదర్శించాలనీ తల్లిదండ్రులు ఏమాత్రం అనుకోవద్దంటున్నారు నిపుణులు. ఈ వయస్సులో పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా మసలుకోవాలి. అప్పుడే వాళ్లు చెప్పాలనుకున్నవి మన దగ్గర నిస్సందేహంగా పంచుకుంటారు. మనం చెప్పినా ఫ్రెండ్లీగానే ఉండాలంటున్నారు నిపుణులు. అప్పుడు వాళ్లు చాలా ఈజీగా తల్లిదండ్రులు చెప్పేది తీసుకుంటారు. అలాకాకుండా పెద్దరికంగా.. వాళ్లేదో పిల్లవాళ్లూ.. ఏమీ తెలియనితనం అని తల్లిదండ్రులు ఎప్పుడూ భావిస్తూ ఉండటం సాధారణంగా జరుగుతోంది. అది సరైన అవగాహన కాదనేది నిపుణుల మాట. ఈ వయస్సులోనే వారికి ప్రేమ గురించైనా, ఆర్థికపరమైన బాధ్యతలైనా తెలియజేసేలా చెప్పాలి. కుటుంబ బంధాలు, బాధ్యతలు తెలిసేలా.. వారు పెద్దయ్యారన్న విషయాన్ని తామూ గుర్తించామన్నట్లు తల్లిదండ్రులు వ్యవహరించాలి. అప్పుడు ఈ వయస్సులో తల్లిదండ్రులు చెప్పేది ఎంచక్కా ఆకళింపు చేసుకుంటారు. అలాగే తల్లిదండ్రులు ఏదైనా సమస్య గురించి సతమతం అవుతున్నప్పుడు పిల్లల అభిప్రాయాల్నీ అడగాలి. మంచి మంచి అభిప్రాయాలు వాళ్లూ కచ్చితంగా చెప్పగలరు. అలాంటివాటిని స్వీకరిస్తే వారికి తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు, గౌరవం పెరుగుతాయి.
నిపుణులు చెప్పే ఈ సూచనలన్నీ ఆయా వయస్సుల్లో పిల్లలతో తల్లిదండ్రులు వ్యవహరించడం అనేది ఇందులో కీలకమైన అంశం. ఆ విధంగా వ్యవహరిస్తే పిల్లలు తల్లిదండ్రులు తీర్చిదిద్దిన ఉత్తమమైన పౌరులుగా తయారవుతారు. చదువు, డ్రెస్‌ వంటి విషయాల్లో ఛాయిస్‌ పిల్లలకే ఇవ్వాలి. ప్రతిదీ పెద్దల ఇష్టానుసారమే జరగాలనే ధోరణి సరికాదు. వారికి ఛాయిస్‌ ఇవ్వడం, సజెస్టివ్‌గా చెప్పేలా ఉండాలి అంటున్నారు నిపుణులు. మొత్తానికి ఇవన్నీ పిల్లల్లో ఆత్మస్థయిర్యాన్ని పెంపొందించేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.

➡️