బిజెపి ఎదురీత

Apr 11,2024 02:20 #BJP, #Daggupati Purandeshwari
  •  మిత్రుల సహకారంపై అనుమానాలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్‌డిఎ కూటమిలో భాగంగా బిజెపి బరిలో ఉండే అభ్యర్థులకు రాష్ట్రంలో మిత్ర పక్షాల నుంచి ఆశించిన సహకారం అందుతుందో లేదోననే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. గత ఎన్నికల్లో ఒక్కశాతం కూడా ఓట్లు తెచ్చుకోలేని బిజెపి, ఈ దఫా టిడిపి, జనసేన మద్దతుతో ఎలాగోలా అసెంబ్లీలో అడుగుపెట్టాలని, లోక్‌సభకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం కోసం ఉవ్విళ్లూరుతోంది. పార్టీల అధ్యక్షులు కలిసి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కేడర్‌ ఎవరి దారి వారిదేనన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆయా పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా గెలవని బిజెపి ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని రంగంలోకి దించింది. ఈ స్థానాన్ని జనసేన అధికార ప్రతినిధిగా వ్యవహరించిన పోతిన మహేష్‌ తొలుత టికెట్‌ ఆశించారు. పొత్తులో భాగంగా స్థానాన్ని బిజెపికి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మహేష్‌, బుధవారం సిఎం జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరారు. మహేష్‌ తీసుకున్న నిర్ణయంతో బిజెపి నెత్తిమీద తాటికాయపడినట్లయ్యింది. ఇది ఇలా ఉంటే నియోజకవర్గంలో ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉండటంతోపాటు స్వతహాగా ఆ వర్గం బిజెపిని వ్యతిరేకిస్తుండటంతో సుజనా చౌదరి ఎదురీత తప్పని పరిస్థితి నెలకొంది.
అనపర్తి నియోజకవర్గంలో టిడిపి బలంగా ఉన్నప్పటికీ ఆ స్థానాన్ని బిజెపికి కేటాయించారు. అక్కడ టిడిపి ఇన్‌ఛార్జిగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్‌ దక్కకపోవడంతో ఆయన వర్గం బిజెపికి ఎంత మాత్రం సహకరిస్తారోననే అనుమానం నెలకొంది. అనపర్తిలో బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్న ఎం శివరామకృష్ణమరాజు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అనపర్తి ఎఫెక్ట్‌ రాజమండ్రి పార్లమెంటుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే ఈ నెలాఖరులో రాజమండ్రిలో నిర్వహించనున్న ఎన్‌డిఎ కూటమి బహిరంగ సభకు ప్రధాని మోడీ రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. కర్నూలు జిల్లా ఆదోని టిడిపి టికెట్‌ను మీనాక్షి నాయుడు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపికి కేటాయించడంతో అక్కడ నుంచి డాక్టర్‌ పార్థసారధి పోటీ చేస్తున్నారు. తొలుత కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన మీనాక్షి నాయుడును టిడిపి అధ్యక్షులు చంద్రబాబు పిలిచి బుజ్జగించడంలో సరేనన్నప్పటికీ ఆయన కేడర్‌ బిజెపికి సపోర్టు చేసేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉన్న ఆదోనిలో బిజెపి గెలవడం అసాధ్యమనే చర్చ నడుస్తోంది. ఇక జమ్మలమడుగులో మాజీ మంత్రి సి ఆదినారాయణరెడ్డి బిజెపి తరపున బరిలో ఉండగా, ఆయన సోదరుడు కుమారుడు భూపేష్‌రెడ్డి కడప నుంచి టిడిపి ఎంపిగా పోటీలో ఉన్నారు. జమ్మలమడుగులో బిజెపి గుర్తు కమలం ప్రజలకు పరిచయం లేనిది కావడంతో ఓటర్లు టర్న్‌ అవుతారో లేదోననే భయం బిజెపిని వెంటాడుతోంది. అలాగే తిరుపతి ఎంపిగా పోటీ చేస్తున్న వి వరప్రసాద్‌కు కూడా కూటమి నుంచే కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారు. తిరుపతి ఎంపి స్థానం నుంచి బిజెపి, ఎమ్మెల్యే స్థానం నుంచి జనసేన పోటీ చేస్తుండటంతో టిడిపి ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఏ మాత్రం సహకరిస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. నరసాపురం నుంచి పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ మిత్రపక్షాలైన టిడిపి, జనసేన బలాన్ని నమ్ముకుని రంగంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

➡️