‘ఉపాధి’కి ఆధారే ఆధారం !

Jan 2,2024 10:52 #special story
  • అమలులోకి కొత్త విధానం
  • అనర్హులుగా తేలిన 34శాతం మంది జాబ్‌ కార్డు హోల్డర్లు

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆధార్‌తో అనుసంధానించి వేతనాలు చెల్లించే విధానం సోమవారం ప్రారంభమైంది. ఈ విధానంపై ఇప్పటికే పలు విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం వాటిని బేఖాతరు చేసింది. జాబ్‌ కార్డులతో ఆధార్‌ అనుసంధానం కాని కార్మికులకు ఇకపై వేతనాలు లభించే అవకాశం లేకుండా పోయింది. ఉపాధి హామీ పథకం కింద జాబ్‌ కార్డులు కలిగిన వారిలో గత నెల 27వ తేదీ నాటికి 34.8% మందికి ఆధార్‌ నెంబరుతో అనుసంధానం జరగలేదు.

ఉపాధి హామీ పథకంలో ఆధార్‌ ఆధారిత చెల్లింపుల పద్ధతిని గత సంవత్సరం జనవరి 30వ తేదీ నాడే తప్పనిసరి చేశారు. దీనిపై పలు విజ్ఞాపనలు అందడంతో గడువును ఐదుసార్లు పొడిగించారు. చివరికి సోమవారం నుండి ఆధార్‌ ఆధారిత చెల్లింపులు మొదలయ్యాయి. ఈ పద్ధతి కింద కార్మికుడి బ్యాంక్‌ ఖాతా, జాబ్‌ కార్డు… ఈ రెండూ ఆధార్‌తో అనుసంధానం కావాల్సి ఉంటుంది. ఈ ఖాతా భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ ‘మ్యాపర్‌’తో కూడా అనుసంధానం కావాలి. ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసినప్పటి నుండీ కార్మికుల జాబ్‌ కార్డుల తొలగింపు గణనీయంగా పెరిగింది. విద్యావేత్తలు, హక్కుల కార్యకర్తలతో కూడిన ‘లిబ్‌టెక్‌ ఇండియా’ కన్సార్టియం తెలిపిన వివరాల ప్రకారం గత 21 నెలలలో 7.6 కోట్ల మంది కార్మికులను ఈ వ్యవస్థ నుండి తొలగించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అందించిన సమాచారం ప్రకారమే డిసెంబర్‌ 27వ తేదీ నాటికి జాబ్‌ కార్డు హోల్డర్లలో 34.8% మంది తాజా చెల్లింపుల పద్ధతిని అనర్హులు అయ్యారు. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో కనీసం ఒక్క రోజైనా పనిచేసిన కార్మికులలో 12.7% మంది ఇప్పటికీ చెల్లింపుల విధానంతో అనుసంధానం కాలేదు.

గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో కనీసం వంద రోజులు పని కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పథకం ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నీరుకారిపోతోంది. ఈ పథకానికి మంచి ఆదరణ ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిపై తగిన శ్రద్ధ చూపడం లేదు. 2023 బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులు కూడా గణనీయంగా తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.89,400 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2023-24లో దానిని రూ.60,000 కోట్లకు కుదించింది.

సాంకేతికతను ఆయుధంగా ఉపయోగించడం ఆపాలి : కాంగ్రెస్‌

జనవరి 1 నుంచి ఉపాధి హామీకి ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఎబిపిఎస్‌)ను తప్పనిసరి చేయడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. కోట్లాది మంది పేద ప్రజలు కనీస ఆదాయాన్ని కూడా సంపాదించకుండా చేయడానికి సాంకేతికతను మోడీ ప్రభుత్వం ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్‌) జైరాం రమేష్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధి హామీ చెల్లింపుల్లో ఎబిపిఎస్‌ను తప్పనిసరి చేయడాన్ని కొత్త సంవత్సరంలో మోడీ ప్రభుత్వ ‘క్రూరమైన కానుక’ అని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు లేదా శాస్త్రీయ విధానాలను అమలు చేయలేదని పేర్కొన్నారు. ఎబిపిఎస్‌ తప్పనిసరి అనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️