స్థానికంగానే పట్టాలివ్వాలని పేదల ధర్నా.. అరెస్టులు, ఉద్రిక్తత

ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) : తిరుపతి శివారు ప్రాంతమైన మంగళం పరిధిలో తమకు శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని చిందేపల్లిలో జగనన్న ఇంటి పట్టాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ పేదలు సోమవారం ధర్నా చేపట్టారు. మంగళం పరిధిలోని చెన్నాయిగుంట వద్ద పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు మంగళం బిటిఆర్‌ కాలనీ నుంచి చెన్నాయిగుంట వరకు పేదలు ర్యాలీ చేపట్టారు. చిందేపల్లిలో వద్దు…మంగళంలోనే పట్టాలు ఇవ్వాలని దారి పొడవునా నినాదాలు చేశారు. ర్యాలీని బిటిఆర్‌ కాలనీ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. చెన్నాయిగుంట సర్వే నెంబర్‌ 195/2లో గల 41 ఎకరాల భూమిలో అక్రమంగా మట్టిని దోపిడీ చేసి రూ.కోట్లు పోగిసిన వారిపై చర్యలు తీసుకోలేని వారు, పేద ప్రజల పోరాటాలకు అడ్డుతగులుతారా? అని సిపిఎం నాయకులు ప్రశ్నించారు. దీంతో వారిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజును అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. వారిపై సిఐ శ్రీకాంత్‌రెడ్డి దురుసుగా వ్యవహరించడంపై సిపిఎం నాయకులు, ఇళ్ళ పట్టాల లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగరాజుతో సహా సుమారు 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరుతూ తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వి. నాగరాజు మాట్లాడుతూ.. మంగళం ప్రాంతంలోనే ఇళ్ళ స్థలాలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సర్వే ట్రయినింగ్‌ అకాడమీకి కేటాయించిన స్థలంలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నారు.

మంగళం పరిధిలోని పేదలకు పట్టాలివ్వాలి : వి. శ్రీనివాసరావు

తిరుపతిలో జగనన్న ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేస్తున్న పట్టాదారులను అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇళ్లు కట్టిస్తానని ప్రగల్భాలు పలుకుతున్న వైసిపి ప్రభుత్వం ముందు కేటాయించిన స్థలాన్ని మార్పు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తుడా క్వార్టరు, మంగళం పరిధిలోనే లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ పోరాటంలో అరెస్ట్‌ అయిన వి.నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.మాధవకృష్ణ, శ్రామిక మహిళా కన్వీనర్‌ ఆర్‌.లక్ష్మి, నగర కమిటీ నాయకులు బుజ్జీ, బి.రవి, బి.వెంకటేష్‌తో సహా 30 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️