సున్నా వడ్డీ ఫార్స్‌

Feb 28,2024 09:23 #interest farce, #Zero
  • రీయింబర్స్‌ స్వల్పం
  • రుణాలకు, రిబేటుకు పొంతనే లేదు
  • పైగా నెపం రైతుల మీదనే
  • సకాలం నిబంధనతో అన్నదాతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టోకరా

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : అన్నదాతలకు సున్నా వడ్డీ పెద్ద ఫార్స్‌గా తయారైంది. ఏటా రైతులకు బ్యాంకులిస్తున్న రుణాలకు, ప్రభుత్వం తన వంతు రీయింబర్స్‌ చేస్తున్న వడ్డీ రాయితీకి మధ్య అసలు పొంతన కుదరట్లేదు. ఒక వైపు బ్యాంకులిస్తున్న అప్పులు ఏటికేడు పెరుగుతుండగా, ప్రభుత్వం ఇస్తున్న వడ్డీ రాయితీ నిధులు అంతకంతకూ తగ్గుతున్నాయి. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నవారిలో అతికష్టం మీద 10-30 శాతం మందికే సున్నా వడ్డీ అందుతోంది. తతిమ్మా రైతులు మొత్తానికి మొత్తం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. రైతులకు సున్నా వడ్డీ రాకపోవడానికి రైతులదే బాధ్యత అని సర్కారు నెపం మోపుతోంది. సకాలంలో రైతులు బ్యాంకులకు అప్పులు తిరిగి చెల్లించనందున అటు కేంద్రం నుంచి వచ్చే 3 శాతం ఇటు రాష్ట్రం నుంచి అందాల్సిన 4 శాతం వడ్డీ కోల్పోతున్నారని తప్పించుకుంటోంది. గడువు లోపు చెల్లించాలన్న నిబంధన అన్నదాతలను సున్నా వడ్డీకి దూరం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆ నిబంధన పట్టుకొని వేలాడుతోంది. రైతుల్లో కొంత మందికి స్వల్ప మొత్తంలో వడ్డీ రాయితీ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది.

ఎప్పటికో జమ

                  ఎన్నికలకు ముందు నవరత్నాల్లో భాగంగా రూ. లక్ష లోపు పంట రుణాలపై రైతులకు వడ్డీ లేని రుణాలంది. పావలా వడ్డీ తీసేసింది. రూ. లక్ష లోపు అప్పులను రైతులు బ్యాంకులకు ‘అసలు’ కడితే చాలు వడ్డీ వ్యవహారం ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చింది. ఆచరణలోకొచ్చేసరికి అసలు, వడ్డీ కలిపి కడితే, వడ్డీని రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా జమ చేస్తామంది. ఈ నిబంధన రైతులను జీరో ఇంటరెస్ట్కు దూరం చేసింది. వైసిపి వచ్చాక ఇప్పటి వరకు మూడు ఖరీఫ్‌, రెండు రబీ సీజన్లకు సున్నా వడ్డీ క్లెయిములు విడుదల చేసింది. ఎప్పుడో అక్టోబర్‌, నవంబర్‌ వడ్డీ రాయితీ ఇవ్వాల్సి ఉండగా బుధవారంనాడు (ఫిబ్రవరి 28) 2022-23 ఖరీఫ్‌, 2021-22 రబీ వడ్డీ రీయింబర్స్‌ చేస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన మూడు ఖరీఫ్‌ సీజన్ల సున్నా వడ్డీ నిధులు ఏటేటా తగ్గగా ఎన్నికల సంవత్సరంలో ప్రస్తుతం స్వల్పంగా పెరిగింది. విడుదల చేసిన రెండు రబీ సీజన్ల వడ్డీ రాయితీ తగ్గుతూ వచ్చింది. ఈ తడవ నామమాత్రంగా పెరిగింది. బ్యాంకులిచ్చిన అప్పులు ఏడాదేడాదీ పెరిగినప్పుడు ఆ మేరకు సర్కారు చేసే వడ్డీ రీయింబర్స్‌ నిధులు పెరగాలి. అందుకు విరుద్ధంగా తగ్గుతోంది. లబ్ధిదారుల సంఖ్య కూడా తగ్గుతోంది.

ఆరో వంతు కూడా లేదు

బ్యాంకులిచ్చే అప్పుల్లో 70 శాతం వరకు రూ. లక్ష లోపు రుణాలుంటాయి. వాటిల్లో రైతులు సకాలంలో (ఏడాది లోపు) చెల్లిస్తున్న రుణాలు 30 శాతం లోపే ఉంటున్నాయి. బ్యాంకులు 60 లక్షలకు పైన రైతులకు రూ. లక్ష లోపు రుణాలిస్తుండగా సర్కారు ఇచ్చే సున్నా వడ్డీ పట్టుమని పది లక్షల మందికి కూడా దక్కట్లేదు. రుణాలు తీసుకున్న రైతులందరికీ రెండు సీజన్లూ కలుపుకొని సున్నా వడ్డీ సుమారు రూ.3 వేల కోట్ల వరకు ఇవ్వాలి. కానీ సర్కారు ఇచ్చేది వాటిల్లో ఆరో వంతు కూడా లేదు.

➡️