CPM: యువతరం మేల్కోవాలి

కార్పొరేట్‌ శక్తుల నుండి దేశాన్ని కాపాడాలి
డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలి
భగత్‌ సింగ్‌ వర్థంతిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :దేశాన్ని కార్పొరేట్‌ శక్తులు, డ్రగ్స్‌ మాఫియా కమ్మేశాయని, విప్లవ యోధుడు భగత్‌సింగ్‌ స్పూర్తితో వాటికి వ్యతిరేకంగా యువతరం పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. భగత్‌సింగ్‌ వర్థంతి సందర్భంగా శనివారం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌ చిత్రపటాలకు ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ విముక్తి కోసం ఆనాడు భగత్‌సింగ్‌ అలుపెరుగని పోరాటం నిర్వహించారని తెలిపారు. వారి త్యాగంతో దేశానికి విముక్తి లభించిందని, కానీ నేడు సామ్రాజ్యవాదుల చేతుల్లో దోపిడీకి గురవుతోందని తెలిపారు. పాలకులు కూడా వారికి తొత్తులుగా మారి దేశాన్ని దోచుకుతింటున్నారని విమర్శించారు. మరోవైపు డ్రగ్‌ మాఫియా విచ్చలవిడిగా విస్తరిస్తోందని అన్నారు. ఇదే కొనసాగితే యువత నిర్వీర్యం అవుతుందని హెచ్చరించారు. యువతరం మేలుకోవాలని కార్పొరేట్‌ శక్తుల నుండి దేశాన్ని కాపాడాలని, డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్‌ మార్కెట్లోకి వెళితే మరో పదేళ్లలో యువత పూర్తిగా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు యువత ముందుకు వచ్చి, కార్పొరేట్‌శక్తుల దోపిడీని ఎదుర్కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారామ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.అశోక్‌ మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత నాయకులు వై.కేశవరావు తదితరులు భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌ విప్లవ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.హరికిషోర్‌, ఆండ్ర మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

➡️