బిజెపిలోకి తప్పుడు వార్తల యూట్యూబర్‌

Apr 27,2024 08:25 #fake news to BJP, #youtuber

న్యూఢిల్లీ : వివాదాస్పద బీహార్‌ యూట్యూబర్‌ త్రిపురారి కుమార్‌ తివారీ అలియాస్‌ మనీష్‌ కశ్యప్‌ గురువారం బిజెపిలో చేరారు. బిజెపి ఎంపి మనోజ్‌ తివారీ సమక్షంలో ఆ పార్టీలో చేరిన మనీష్‌ తరువాత పార్టీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాను కలుసుకున్నారు. బీహార్‌కు వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని తప్పుడు వార్తలు యూ ట్యూబ్‌లో పెట్టడంతో కశ్యప్‌ను గత ఏడాది అరెస్టు చేశారు. సుమారు తొమ్మిది నెలల పాటు తమిళనాడు జైల్లో ఉండి, గత ఏడాది డిసెంబరులో బెయిల్‌పై విడుదలయ్యాడు.
తమిళనాడులో బీహార్‌ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని తప్పుడు వార్తలు ప్రసారమవుతున్నప్పుడే.. వాటితో బిజెపికి సంబంధం ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వార్తలను ప్రసారం చేసిన కశ్యప్‌ ఇప్పుడు బిజెపిలో చేరడంతో ఆ విమర్శలు నిజమేనని స్పష్టమయింది. సోషల్‌ మీడియా పేరుతో ప్రజల నుంచి అక్రమ వసూళ్లు, పశ్చిమ చంపారన్‌ జిల్లాలో మహారాణి జానకీ కున్వార్‌ ఆసుపత్రి ఆవరణలోని కింగ్‌ ఎడ్వర్డ్‌ విగ్రహం ధ్వంసం, పోలీసులపై దాడి, పుల్వామా ఉగ్రదాడి తరువాత పాట్నాలోని కాశ్మీరీ దుకాణదారులపై దాడి తదితర కేసులలోనూ పోలీసులు గతంలో కశ్యప్‌ను అరెస్టు చేశారు. బీహార్‌లో 13, తమిళనాడులో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. వచ్చే ఏడాది బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కశ్యప్‌ను బిజెపి పోటీలో నిలపనున్నట్లు తెలిసింది.

➡️