సత్యసాయి జిల్లాలో నువ్వా..నేనా..!

Apr 13,2024 00:45 #election, #Sathya Sai district?

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి :సత్యసాయి జిల్లాలో రాజకీయాలు నువ్వా.. నేనా.. అన్నట్టుగా సాగుతున్నాయి. ఈ జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానముంది. ఇక్కడ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం మినహా తక్కిన ఆరింటిలోనూ వైసిపియే గెలుపొందింది. పార్లమెంటు స్థానంలో సైతం వైసిపినే గెలుపొందింది. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 2014, 2019లో రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలిస్తే హ్యాట్రిక్‌ విజయం కానుంది. హిందూపురం అసెంబ్లీ పరిధిలో వైసిపిలో ఇప్పటికీ గ్రూపు తగాదాలు నడుస్తూనే ఉన్నాయి. అంతకు మునుపు మహమ్మద్‌ ఇక్బాల్‌ పోటీ చేశారు. ఆయన్ను గతేడాదిలో మార్చి దీపికను తీసుకొచ్చారు. ఆమె ఇప్పుడు హిందూపురం వైసిపి అభ్యర్థిగా బరిలో ఉంది. ఆమెకు స్థానిక నాయకుల మధ్య దూరం తగ్గించేందుకు రాయలసీమ పార్టీ ఇన్‌ఛార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా ప్రయత్నాలు చేశారు. ఇవి కొలిక్కి వచ్చాయి. ఈసారి వైసిపి విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టిడిపి నాయకులు మాత్రమే హిందూపురం టిడిపి కంచుకోట అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగానే నడుస్తోంది. ఇక ధర్మ వరం నియోజకవర్గం టిడిపి, బిజెపి పొత్తుల్లో భాగంగా బిజెపికి కేటా యించారు. మాజీ ఎమ్మెల్యే జి.సూర్య నారాయణకు టిక్కెట్టు ఉంటుందని ముందుగా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆయనకు కాకుండా సత్యకుమార్‌కు టిక్కెట్టు కేటాయించారు. దీంతో స్థానిక నాయకుడైన జి.సూర్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే బిజెపి నామ మాత్రపు పోటీకి పరిమితం అవుతుంది. సూర్యనారాయణ, వైసిపి మధ్యనే పోటీ కొనసాగే అకవాశముంది. కదిరి అసెంబ్లీ టిక్కెట్టును వైసిపి మైనార్టీ నాయకుడు మక్బుల్‌కు కేటాయించింది. సిట్టింగు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వైసిపికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల్లో సహకరించడం అనుమానంగానే ఉంది. టిడిపి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు కేటాయించింది. దీంతో వైసిపి నుంచి టిడిపికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా తిరిగి వైసిపిలోకే చేరారు. ఇది టిడిపికి కొంత వరకు నష్టం చేకూర్చే అవకాశముంది. మడకశిర టిడిపిలో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉంది. టిడిపి అభ్యర్థి సునీల్‌కుమార్‌ను మార్చాలని ఆ పార్టీలో కొంత మంది నాయకులు పట్టుబడుతున్నారు. వైసిపి ఇక్కడ కూడా సామాన్యమైన వ్యవసాయ కూలీ లక్కప్పకు టిక్కెట్టును కేటాయించింది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి సుధాకర్‌ కూడా గట్టిపోనే ఇచ్చే అవకాశముంది. పెనుకొండలో మాజీ మంత్రి ఉషచరణ్‌ శ్రీ బరిలోనున్నారు. కళ్యాణుదర్గం నుంచి ఇక్కడికి మార్పులో భాగంగా ఆమె వచ్చారు. ఆమె తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తూ పోతున్నారు. టిడిపి ముందున్న మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధిని హిందూపురం పార్లమెంటుకు పంపించి, సవితమ్మను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపింది. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో పరిటాల సునీత టిడిపి తరపున బరిలో ఉండగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వైసిపి నుంచి బరిలోనున్నారు. ఇద్దరి మధ్య పోటీ నువ్వా…నేనా అన్నట్టుగా ఉంది. పుట్టపర్తిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మరోసారి వైసిపి తరుపున బరిలో ఉండగా, టిడిపి తరుపున మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డి బరిలోనున్నారు. ఇక్కడ కూడా ఇద్దరి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది.

➡️