పోలీసు సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ పునరుద్ధరించాలి !- సిఇసికి ఏచూరి లేఖ

పశ్చిమ త్రిపురలో పోలింగ్‌ అవకతవకలపై మరో లేఖ
న్యూఢిల్లీ : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు బుధవారం రెండు లేఖలు రాశారు. కేరళకు చెందిన పోలీసు సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించాలని కోరుతూ ఒక లేఖ, పశ్చిమ త్రిపుర నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాలకు సంబంధించి మరో లేఖ రాశారు.
విధి నిర్వహణలో భాగంగా తమ సొంత రాష్ట్రానికి వెలుపల ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న కేరళకు చెందిన పోలీసు సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతూ ఏచూరి ఒక లేఖ రాశారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓటు వేసే హక్కు లేదని తెలుసుకుని వారు తీవ్రంగా బాధపడుతున్నారు. కేరళ అసెంబ్లీకి 2021లో జరిగిన ఎన్నికల్లో కూడా వారు ఓటు వేయలేకపోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోస్టల్‌ ఓటు సదుపాయాన్ని ఉపయోగించుకుని వారు ఓట్ల లెక్కింపు తేదీకి ముందుగానే తమ బ్యాలెట్లను పంపేవారు. కానీ ఇప్పుడు నిర్దేశించిన తేదీల్లో పోస్టల్‌ ఓటు వెరిఫికేషన్‌ సెంటర్‌లో మాత్రమే ఓటు వేయాల్సి వుంది. దీనివల్ల దాదాపు 1500 మంది పోలీసు అధికారులు తమ ఓటు హక్కును కోల్పోతున్నారు.. శుక్రవారం జరిగే రెండో విడత పోలింగ్‌లో కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమ పోస్టల్‌ బ్యాలెట్‌ను నిర్దిష్ట కేంద్రాల్లో ఏప్రిల్‌ 22, 23, 24 తేదీల్లో ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘం చెప్పింది. తమకు అప్పగించిన ఎన్నికల విధుల నిమిత్తం వీరందరూ ఇప్పటికే రాష్ట్రం వెలుపలకు వెళ్ళిపోయినందున వీరెవ్వరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతనే వీరు తిరిగి వెనక్కి రాగలుగుతారు. ఇందుకు సంబంధించి ‘గౖౖెర్హాజరైన ఓటర్లకు ముఖ్య విధులను నిర్వర్తించే వ్యక్తుల కేటగిరీలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌’కు సంబంధించి మార్చి 19న భారత ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన 52-2024-ఎస్‌డిఆర్‌-వాల్యూమ్‌.1 సర్క్యులర్‌ అస్పష్టంగా, అసంబద్ధంగా వుందని ఏచూరి ఆ లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్‌ గుర్తించిన కీలకమైన సేవలందించే కేటగిరీలోకి వచ్చే పోలీసు సిబ్బందికి ఇలా ఓటు హక్కును నిరాకరించడమనేది, ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించే ఎన్నికల కమిషన్‌ యతాల్నకు పూర్తి విరుద్ధమని ఆ లేఖ పేర్కొంది.
ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని ప్రతి ఓటరు ఓటు వేసేలా చర్యలు తీసుకోవాల్సి వుందన్న విషయాన్ని మీరు అంగీకరించాలి. ఈ నేపథ్యంలో గతంలో వున్న పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని పునరుద్ధరించి, తమ నియోజకవర్గాలకు వెలుపల విధులు నిర్వర్తించే పోలీసు అధికారులందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఏచూరి ఆ లేఖలో ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ఓట్లన్నీ కౌంటింగ్‌ తేదీకి ఒక రోజు ముందుగా అందేలా గడువు పెంచాలని, లేదా వారి హక్కు నిరాకరించబడకుండా ప్రత్యామ్నాయం ఏదైనా చూడాలని కోరారు. కేరళ సిఇఓకు పోలీసులు, అధికారుల సమాఖ్య ఇప్పటికే దీనిపై అభ్యర్ధన లేఖలు అందచేసిందని, వాటిని సిఇఓ ఎన్నికల కమిషన్‌కు పంపారని ఏచూరి తెలిపారు.
పశ్చిమ త్రిపురలో ఎన్నికల అవకతవకలు
పశ్చిమ త్రిపుర నియోజకవర్గంలో కొన్ని పోలింగ్‌ బూత్‌ల్లో పోలైన ఓట్లకు, మొత్తం ఓట్లకు పొంతన లేకపోవడంపై సిపిఎం త్రిపుర రాష్ట్ర కమిటీ కార్యదర్శి జితేంద్ర చౌదరి ఫిర్యాదు చేశారని ఏచూరి తెలిపారు. అలాగే పశ్చిమ త్రిపుర పార్లమెంటరీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్ధిగా పోటీలో వున్న విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను కూడా జితేంద్ర చౌదరి ఇసి దృష్టికి తీసుకెళ్లారు.. ఆ రెండు ఫిర్యాదుల ప్రతులను ఏచూరి సిఇసికి రాసిన రెండో లేఖతో జతచేశారు. ఈ ఫిర్యాదులను భారత ఎన్నికల కమిషన్‌ పరిగణనలోకి తీసుకుని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఏచూరి కోరారు.

➡️