జగన్‌, చంద్రబాబులది స్వలాభం

Jan 24,2024 08:06 #srikakulam, #Visit, #ys sharmila

-వైసిపి, టిడిపి కేంద్రానికి అమ్ముడుపోయాయి

-ప్రజలు తిరస్కరించినా రాష్ట్రంలో బిజెపి ఏలుబడే!

-పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, ఇచ్ఛాపురం, విజయనగరం కోట :రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తున్నారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు. బిజెపికి టిడిపి, వైసిపి అమ్ముడుపోయాయని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయకుండా బిజెపిని తిరస్కరించినా, రాష్ట్రాన్ని మాత్రం ఆ పార్టీయే ఏలుతోందని అన్నారు. బిజెపి చేతిలో కీలుబమ్మలా జగన్‌ ప్రభుత్వం మారిందని విమర్శించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మంగళవారం ఆమె పర్యటించారు. ఇచ్ఛాపురంలో ప్రజాప్రస్థానం విజయస్తూపం వద్ద నివాళ్లర్పించారు. అనంతరం ఇక్కడి ఓ ఫంక్షన్‌ హాలులోనూ, విజయనగరంలో ఓ ప్రయివేట్‌ కల్యాణ మండపంలోనూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో షర్మిల సమావేశమయ్యారు. రాష్ట్రంలో 25 మంది ఎంపిలు, ఆరుగురు రాజ్యసభలు ఉన్నా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఏ విషయంలోనూ వ్యతిరేకించడం లేదన్నారు. బిజెపి మతతత్వ పార్టీ అని, ఒక మతాన్ని రెచ్చగొట్టి మరో మతాన్ని అవమానపరిచి ఆ మంటల్లో చలి కాచుకోవాలన్నదే ఆ పార్టీకి తెలిసిన రాజకీయమని దుయ్యబట్టారు. అందుకే కీర్తిశేషులు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏనాడూ ఆ పార్టీని నమ్మలేదని, చివరి వరకూ బిజెపి సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఎపికి ప్రత్యేక హోదా పదేళ్లు కాదు… 15 ఏళ్లు ఇస్తామన్న బిజెపి హామీ ఏమైందని ప్రశ్నించారు. 25 మంది ఎంపిలను గెలిపిస్తే బిజెపి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్న చెప్పిన మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే రాహుల్‌ గాంధీ ప్రధాని అయిన వెంటనే ఎపికి ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ను అవమానించిందంటూ చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు. తాను జగన్‌రెడ్డి అనడం నచ్చలేదని వైవి.సుబ్బారెడ్డి అంటున్నారని, ఇక నుంచి జగనన్నగారు అనడానికి తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని చూపిస్తామన్న సుబ్బారెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నామని చెప్పారు. తేదీ, సమయం మీరు చెప్పినా, మమ్మల్ని చెప్పమన్నా చెప్తామన్నారు. అభివృద్ధి పరిశీలనకు తనతోపాటు మేధావులు, మీడియా, ప్రతిపక్షాలు కూడా వస్తాయని తెలిపారు. చెప్పిన మూడు రాజధానులు ఎక్కడ, కడతామన్న పోలవరం ప్రాజెక్టు ఎక్కడ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, జాబ్‌ కేలండర్‌, నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, పట్టుమని పది పరిశ్రమలు కూడా రాలేదని విమర్శించారు. మద్యంతో వచ్చిన ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారని, రాజధాని, పోలవరం, మెట్రో రైలు లేని రాష్ట్రంగా మిగిల్చారని తూర్పారపట్టారు.

➡️