రాజధాని పేదలకు పింఛను పెంపు

Feb 16,2024 07:23 #AP Capital, #CM YS Jagan
ys jagan on pension in capital city
  •  సేవచేసే వాలంటీర్లే రేపటి లీడర్లు…
  • వారే నా సైన్యం 
  • యుద్ధానికి సిద్ధం కండి 
  • వాలంటీర్ల అభినందన సభలో సిఎం జగన్‌

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కార్మికులకు, నిరుపేదలకు ఇస్తున్న పింఛను మొత్తాన్ని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో గురువారం జరిగిన వాలంటీర్ల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. విశేష సేవలందించిన వాలంటీర్లను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని ప్రాంత నిరుపేదల సమస్యలను ప్రస్తావించారు. అమరావతిలో వ్యవసాయ భూములన్నీ భూ సమీకరణలో రాజధాని నిర్మాణానికి ఇవ్వడం వల్ల పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న భూమిలేని వ్యవసాయ కార్మికులకు, నిరుపేదలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.2,500 పింఛనును రూ.5 వేలకు పెంచుతున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే మేకతోటి సుచరిత విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టిడిపి రూపొందించిన ఆరు పథకాల కిచిడీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఎన్నికలయ్యాక ఈ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారని చెప్పారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలయితే, తాము తీసుకొచ్చిన సచివాలయాల వ్యవస్థ తులసి మొక్కలని అభివర్ణించారు. ఈ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు ప్రజలకు విస్తృతంగా సేవలందిస్తున్నారని చెప్పారు. ‘సూర్యుడు ఉదయించకముందే ఇంటి ముందుకు వెళ్లి తలుపుతట్టి పింఛను ఇస్తున్నారు. కుల, మతాలు చూడకుండా సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారు’ అని అన్నారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లే రేపటి లీడర్లు అవుతారని, అటువంటి వారే తన సైన్యం అని చెప్పారు. చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు రాబోయే రెండు నెలల్లో చొక్కాలు మడత పెట్టి యుద్ధానికి సిద్ధం కావాలని వలంటీర్లకు పిలుపునిచ్చారు. జన్మభూమి కమిటీల వల్ల పేదలు నష్టపోయారన్నారు. పేదలకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడూ లేదని విమర్శించారు. చంద్రబాబు పాలన పేదల పాలిట విష వృక్షమని, వైసిపి పాలన కల్పవృక్షం అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల కోసం తాను గత ఐదేళ్లుగా ఏడాదికి రూ.70 వేల కోట్ల చొప్పున డిబిటి ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశానని తెలిపారు. టిడిపి అధికారంలోకి వస్తే తాను అమలు చేసిన పథకాలను కొనసాగించడంతోపాటు వారు ప్రకటించిన మేనిఫెస్టో అమలుకు మరో రూ.లక్షా 26 వేల కోట్లు ఖర్చు అవుతాయన్నారు. ఎలాగూ ఇచ్చేది లేదని, అందువల్ల ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు అనేక విధాలుగా మభ్యపెడతారని, ఆయనను నమ్మద్దని ప్రజలకు జగన్‌ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. వలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపు మంటని, చంద్రబాబుకు ఓటు వేయడం అంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంటికి పిలిపించుకోవడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు వలంటీర్లకు వందనం కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 875 మంది వలంటీర్లకు సేవా వజ్రా అవార్డులు, 4,150 మందికి సేవారత్న, 2,50,439 మందికి సేవా మిత్ర అవార్డులతో సన్మానం చేస్తున్నట్టు వివరించారు. ఫిరంగిపురం కొండపై ఉన్న కార్మెల్‌ మాతా ఆలయానికి ఘాట్‌ రోడ్డు నిర్మాణం కోసం రూ.39 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, బి.ముత్యాలనాయుడు, అంబటి రాంబాబు, విడదల రజనీ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అజరు జైన్‌, శ్రీలక్ష్మీ, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తదితరులు పాల్గొన్నారు.

 

➡️