నాలుగో జాబితాపై కసరత్తు 

Jan 18,2024 08:01 #YCP, #ycp incharges
YCP-MLAs waiting for 4th list

తాడేపల్లికి క్యూకట్టిన ఎమ్మెల్యేలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బరిలో వుండే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే 59 స్థానాలకు మూడు విడతలుగా జాబితాలను విడుదల చేసిన వైసిపి అధిష్టానం నాలుగో జాబితా కోసం సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు బుధవారం పలువురు ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించి చర్చలు జరిపారు. తాడేపల్లికి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులతో ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. విజయనగరం జిల్లా ఎస్‌ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తదితరులు తాడేపల్లికి వచ్చి మంతనాలు జరిపారు. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి భేటి అయ్యారు. ఒంగోలు ఎంపి అభ్యర్థిత్వంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ఈ స్థానంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్‌ ఇవ్వాల్సిందేనని బాలినేని పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశం అయ్యింది. ఈ నెల 19న విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ తర్వాత నాలుగో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసేవీలుంది.

➡️