మేడే సందర్భంగా రచనల పోటీ

  • పోస్టర్‌ ఆవిష్కరణ 

ప్రజాశక్తి – విజయవాడ : మేడే సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనల పోటీ నిర్వహిస్తున్నట్టు జాషువా సాంస్కృతిక వేదిక తెలిపింది. ఈ మేరకు సోమవారం విజయవాడ బాలోత్సవ్‌ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ బాధ్యులు పోస్టరును విడుదల చేశారు. అభివృద్ధిలో అసమానతలు, దోపిడీ, వివక్ష, సామాజిక సంక్షోభం తదితర అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రచయితలు తమ రచనలు పంపవచ్చు. కథలు, కవితలు, పాటలు, వ్యాసాల ప్రక్రియల్లో ఈ పోటీ ఉంటుంది. ఒక్కో విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.ఐదు వేలు, రూ.మూడు వేలు, రూ.రెండు వేలు చొప్పున ఉంటాయి. ప్రతి విభాగంలోనూ రూ.వెయ్యి చొప్పున రెండు ప్రోత్సాహక బహుమతులూ ఉంటాయి. ఆ నెలాఖరుకల్లా రచనల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, మే నెల ఐదున (ఆదివారం) విజయవాడలో జరిగే సభలో విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుంది. ఒకటికి మించి రచనలు పంపకూడదు. కథలు, వ్యాసాలూ ఎ4 సైజులో 4, 5 పేజీల వరకూ ఉండొచ్చు. కవిత 30 పంక్తులకు, పాట ఒక పల్లవి, 4 చరణాలు ఉండాలి. తెలుగువారు ఏ ప్రాంతంవారైనా పాల్గొనవొచ్చు. రచనలు పంపాల్సిన మెయిల్‌ ఐడి :sramikasambaralu24@gmail.com  రచనలు చేరటానికి చివరి తేదీ ఏప్రిల్‌ 20వ తేదీ. ఈ సమావేశంలో సాహితీ స్రవంతి రాష్ట్ర నాయకులు వరప్రసాద్‌, శాంతిశ్రీ, ఉషారాణి, సాహిత్య ప్రస్థానం వర్కింగ్‌ ఎడిటర్‌ సత్యాజీ, అరసం కార్యదర్శి పరుచూరి అజరు, కవి, రచయిత గడ్డం విజయరావు, కె లక్ష్మయ్య, జాషువా సాంస్కృతిక వేదిక బాధ్యులు గుండు నారాయణరావు పాల్గొన్నారు.

➡️