వర్షాలకు అన్నదాత ఆందోళన

Dec 4,2023 23:43

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మిచౌంగు తుఫాను కారణంగా నిరంతరాయంగా కురిసిన వర్షానికి పంట పొలాలు పూర్తిగా నేలవాలాయి. మరికొన్ని చోట్ల ఓదెలలో నీరు నిలబడింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నిన్నటి వరకు నిలబడి రైతులకు ఆశలు చూపించిన వరి పంట నేడు వర్షానికి నేల వాలి నీళ్లల్లో తేలి ఆడుతుండటంతో అన్నదాత గుండె పగిలినంత పనవుతుంది. ఏడాది పంటలు ఆశాజనకంగా ఉన్నాయని ఆశపడిన రైతుకు తుఫాను పెను ముప్పును కలిగిస్తుందని వాపోతున్నారు. ఈపాటికే కొందరు రైతులు హార్వెస్టర్ల ద్వారా ధాన్యాన్ని రహదారిపై చేర్చి వర్షానికి తడవకుండా పరదాలు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు వేసిన కుప్పలపై పట్టాలు కప్పి భద్రపరుస్తున్నారు. కోతలకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలి నీటిలో ఉండటంతో గింజ మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అంతేకాక నేల వాలిన పైరును కోతలు కోయడానికి కూడా అధిక కూలిలు వెచ్చించాల్సి ఉంటుందని రైతులు అంటున్నారు. దాన్యం నాణ్యత తగ్గి ధరల కోత విధించబడుతుందని వాపుతున్నారు. నిరంతరాయంగా కులుస్తున్న వర్షాలకు అక్కడక్కడ కోసిన వరి పనల్లో నీరు నిలబడటంతో కంకి పూర్తిగా నీటిలో మునిగి రంగు మారి మొలకెత్తే ప్రమాదం ఉందని, ఫైరు నేల వాలి ఉండటంతో వర్షాలు కురుస్తాయని తెలిసినప్పటికీ కోయక తప్పలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️