సమ్మె విచ్ఛిన్నానికి పోటీ కార్మికులు

Dec 30,2023 10:33 #cpm dharna, #muncipal workers
  •  అడ్డుకున్న మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు 
  • రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన సమ్మె
  • అడ్డుకున్న మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు 
  • రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఉధృతరూపం దాల్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు తమ నిరసన గళం వినిపించారు. ఈ క్రమంలో సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా పోటీ కార్మికులను రంగంలోకి దించింది. వారిని సమ్మెలో ఉన్న కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల సమ్మె శుక్రవారం నాలుగో రోజుకు చేరింది. విశాఖ జివిఎంసి అధికారులు పోటీ కార్మికులతో చెత్తను వాహనాల్లో తరలిస్తుండగా సమ్మెలో ఉన్న కార్మికులు భీమిలి రెల్లివీధిలో అడ్డుకున్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు జివిఎంసి అధికారులు చేసిన ప్రయత్నాలను పారిశుధ్య కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వం తమను రెచ్చగొట్టే చర్యలకు దిగడం సరికాదన్నారు. విశాఖలోని జివిఎంసి జోన్‌ – 4 టౌన్‌ కొత్త రోడ్డు సూయజ్‌ ఫారం వద్ద మున్సిపల్‌ కార్మికుల సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు సందర్శించి మద్దతు తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ప్రభుత్వం సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి మున్సిపల్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, దాన్ని నెరవేర్చకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.

విజయవాడ రాణిగారితోటలో పోటీ కార్మికులను సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకున్నారు. ధర్నా చౌక్‌లో సమ్మెనుద్దేశించి ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడుతూ.. మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న న్యాయమైన ఆందోళనకు సిపిఎం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మున్సిపల్‌ అధికారులు కొందరు కూలీలను వెంట తీసుకొచ్చి చెత్తను తొలగిస్తుండగా సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. సమస్యలు పరిష్కరించకుండా తమ పొట్టకొట్టే చర్యలకు పూనుకుంటారా? అని అధికారులపై మున్సిపల్‌ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో పలు చోట్ల కార్మికులను అధికారులు బెదిరించారు. అధికారుల తీరును నిరసిస్తూ ఎంటిఎంసి కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్‌టిఆర్‌, పల్నాడు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మెడకు ఉరితాళ్లు బిగించుకొని, భిక్షాటనతో నిరసనలు తెలిపారు. పలుచోట్ల అర్ధనగ ప్రదర్శన చేశారు.

➡️