వేతన బకాయిలు చెల్లించాలని కార్మికుల ధర్నా

Apr 15,2024 22:04

సాలూరు:  తమ వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ పట్టణ అధ్యక్షుడు టి.రాముడు, కార్యదర్శి టి.శంకరరావు ఆధ్వర్యాన కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వేతనాలను చెల్లించడంలో మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇదే వైఖరి కొనసాగితే ఏ క్షణమైనా నిరధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు మాట్లాడుతూ మూడు నెలలుగా వేతనాలందకపోతే కార్మికులు ఎలా జీవనం సాగిస్తారని ప్రశ్నించారు. వేతనాల మంజూరుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే డిఎంఎ దృష్టికి సమస్య తీసుకెళ్తామని చెప్పారు. అనంతరం మేనేజర్‌ రాఘవాచార్యులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా కన్వీనర్‌ టి.ఇందు పాల్గొన్నారు.పాలకొండ : జీవో 36 ప్రకారం కొత్త జీతాలు, బకాయి జీతాలు సమ్మె కాలపు జీతం రూ.వెయ్యి కానుక, యూనిఫారం కుట్టుకూలి మంజూరు తదితర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కమిషనర్‌కు వినతిని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ పాలకొండ కమిటీ గౌరవ అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ మున్సిపల్‌ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం విడనాడాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పాలకవర్గం మున్సిపల్‌ కమిషనర్‌ సమక్షంలో జరిగిన సమస్యలు నేటికీ పరిష్కారం చేయకపోవడం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే సిబ్బంది యావన్మంది సామూహిక సెలవులు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్‌ సురేష్‌, సిహెచ్‌ సంజీవి, సిహెచ్‌ కార్తీక్‌, విమల, శ్రీదేవి, రఘు, భాస్కర్‌, మధు, అప్పలనాయుడు పాల్గొన్నారు.

➡️