ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీళ్లు

Apr 21,2024 22:02 #pavan kalyan
  • అతి తక్కువ కాలంలో ‘పోలవరం’ పూర్తి
  •  జిఒ 217ను రద్దు చేస్తాం
  • ఆక్వా రంగాన్ని ఆదుకుంటాం
  •  నరసాపురం, భీమవరం సభల్లో పవన్‌కల్యాణ్‌

ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : టిడిపి, బిజెపి, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి చేతికీ పని, ప్రతి చేనుకూ నీళ్లు ఇస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసాపురం, భీమవరంల్లో జరిగిన సభల్లో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో రెండు చోట్ల తాను ఓడిపోయినా ఇంకా నిలబడి ఉన్నానంటే.. అది మీ అందరి అభిమానమన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలనూ కొనసాగిస్తామని, ఎటువంటి కోతా విధించబోమని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును అతితక్కువ కాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు దాటిన బిసిలకు రూ.5 వేలు పింఛను ఇంటి వద్దకే అందిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం ఉండే బిసి రిజర్వేషన్లను వైసిపి ప్రభుత్వం 24 శాతానికి కుదించిందని విమర్శించారు. గతం మాదిరిగానే 34 శాతానికి తీసుకెళ్తామన్నారు.
లేసు అల్లికలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆక్వా రైతుల అభివృద్ధికి కృషి చేస్తామని, భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. 2019 నుంచి సీడ్‌ ధర రూ.11 వందలకు పెరిగిందని, హేచరీలకు యూనిట్‌ విద్యుత్‌ రూ.8కు పెంచడమే కారణమన్నారు. మత్స్యకార కుటుంబాలకు హాని కలిగించే జిఒ 217ను రద్దు చేస్తామని, 51 మత్స్యకార సొసైటీలకు రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నరసాపురంలో నియంతృత్వ పాలన సాగుతోందని, దీన్ని తిప్పికొట్టాలని కోరారు. సజ్జల రామకృష్ణారెడ్డి తన సోదరుడు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్రంలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండాపోయిందని, ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అన్యామని పేర్కొన్నారు.
వైసిపి ప్రభుత్వం కులాలను విడగొట్టుకుంటు వెళ్తే తాను కలుపుకుంటూ వెళ్తానన్నారు. బిజెపి మద్దతు లేకపోతే రాష్ట్రం అభివృద్ధి అసాధ్యమన్నారు. తాను ఈ నెల 23న పిఠాపురంలో నామినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ రాజ్యం పోవాలని, ప్రశాంతమైన భీమవరం రావాలంటే అనుభవజ్ఞుడైన పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)ను గెలిపించాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గ్రంధి శ్రీనివాస్‌ భీమవరంలో అర్బన్‌ బ్యాంక్‌ లేకుండా చేశారని ఆరోపించారు. భీమవరంలో పోటీ చేయడానికి తన దగ్గర రూ.200 కోట్లు డబ్బు లేదని, ఓటుకు రూ.ఆరు వేలు ఇచ్చే స్తోమత లేదని తెలిపారు. గ్రంధికి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తానని హెచ్చరించారు. సభలో జనసేన నరసాపురం అభ్యర్థి బొమ్మిడి నాయకర్‌, భీమవరం అభ్యర్థి పి.రామాంజనేయులు, బిజెపి ఎంపి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, టిడిపి నేతలు పాల్గొన్నారు.

➡️