వైజ్ఞానిక రంగంలో వనితలు

Feb 11,2024 08:07 #Articles, #Science, #Stories, #Women Stories
women and girls in science story cover

సైన్స్‌ లేనిదే మనుగడ సాగదు. నిత్యజీవితంలో సైన్స్‌ అంతర్భాగమై ఉంది. సైన్సు అంటే ఒక కార్యకారక సంబంధం. ఏ చర్య అయినా మహత్తులు, మాయాజాలాలు, అతీతశక్తుల కారణంగా జరగదు. దాని వెనుకొక క్రమబద్ధమైన కారణం ఉంటుంది. నిరూపణకు నిలబడుతుంది. ప్రకృతిలో ప్రతిదీ సైన్స్‌తో ముడిపడి ఉంది. ప్రకృతిలోని ఈ సూత్రాలను అర్థం చేసుకోవటం వల్లనే వైజ్ఞానిక రంగంలో మనం ఎంతో ప్రగతి సాధించాం. ఎన్నో సదుపాయాలను, సౌకర్యాలను పొందుతున్నాం. ఇందులో స్త్రీ-పురుషులు ఇద్దరూ భాగస్వాములై ఉన్నారు. కానీ సైన్స్‌ రంగంలోకి స్త్రీని ప్రోత్సహించడంలో అనేక అవరోధాలు ఉన్నాయనేది వాస్తవం. అయినప్పటికీ స్త్రీలు వాటిని అధిగమిస్తూ పురోగమించడం వల్లే అనేక పరిశోధనలు జరిగాయి. నేడు ‘సైన్స్‌లో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవం’ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

‘నాన్నా.. నేను ఇంటర్‌లో సైన్స్‌కోర్స్‌ తీనుకుని పరిశోధన చేసి శాస్త్రవేత్తనవుతా’ ఒక చిన్నారి తండ్రితో తన భవిష్యత్‌ గురించి చెప్పిన మాట.

‘భలేదానివిరా.. నీకు మొదటి నుంచీ లెక్కలు, సైన్స్‌లో అంత గొప్ప మార్కులేమీ రాలేదు. పైగా లెక్కలంటే ఎన్నో సందర్భాలలో భయపడ్డావు. చక్కగా ఆర్ట్స్‌ లేదా కామర్స్‌ గ్రూపు తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు’ తండ్రి సమాధానం.

‘లేదు నాన్నా.. సైన్సంటే నాకు చాలా ఇష్టం.’

‘నువ్వింకేమీ మాట్లాడకు. నువ్వేం చదవగలవో నాకు తెలియదా? నీ స్నేహితులెవరో చేరుతున్నారని, నువ్వు కూడా సైన్స్‌ గ్రూపు తీసుకుంటాననకూడదు. నే చెప్పినట్లు చెయ్యి.

‘ఇది ఒక తండ్రి – కూతురు మధ్య జరిగిన సంభాషణ మాత్రమే కాదు. ఎంతోమంది బాలికలు స్టెమ్‌ (STEM – సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమేటిక్స్‌) రంగంలోకి అడుగు పెట్టకపోవడానికి ఉండే ప్రధాన కారణాలలో ఒకటి.. కుటుంబ ప్రోత్సాహం లేకపోవడం!

బడి నుంచే వివక్ష..

కొన్ని దేశాలలో తప్ప, అభివృద్ధి చెందుతున్న మనలాంటి ఎన్నో దేశాలలో పాఠశాల విద్యలోనే విజ్ఞానశాస్త్రం, గణితంలో బాలికలపై వివక్ష అధికంగా ఉంది. ఆ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు కూడా బాలికల ప్రతిభపై అంత నమ్మకంగా ఉండరు. దాంతో బాలురపై పెట్టిన శ్రద్ధ బాలికలపై ఉండదు. నిరుత్సాహపూరిత వాతావరణంలో అరకొరగా సైన్స్‌, గణితాలను అభ్యసించిన బాలికలు వాటిలో తమ కెరియర్‌కు సోపానాలు వేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపరు.

అంతేగాక ఆయా దేశాల్లో ఉన్న నిరక్షరాస్యత, సామాజిక చైతన్యలేమి వలన బాల్య వివాహాలు అధికం. దీని ఫలితంగా గ్రాడ్యుయేషన్‌ స్థాయికి వెళ్ళే బాలికల శాతం తక్కువగా ఉంటోంది. గ్రాడ్యుయేషన్‌ చదివినా, ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడేందుకే వారి పరిస్థితులు ప్రేరేపిస్తుంటాయి తప్ప, ముందడుగు వేయనీయవు. దీంతో పరిశోధన వరకు వచ్చే యువతుల సంఖ్య అతిస్వల్పంగా ఉంటోంది.

పరిశోధనా రంగంలో..

స్టెమ్‌ రంగంలో.. ముఖ్యంగా ఇందులోని పరిశోధనా విభాగంలో స్త్రీల పట్ల వివక్ష అధికం. వారి సామర్థ్యంపై కూడా ఎన్నో అనుమానాలు. ఇక్కడో ఉదాహరణను మనం చెప్పుకోవచ్చు. 1993లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సి) బెంగళూరులో పరిశోధకురాలిగా చేరాలని కమలాసహానీ పెట్టిన దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అప్పుడు ఆ సంస్థకు ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, నోబుల్‌ బహుమతి విజేత అయిన సర్‌ సి.వి.రామన్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. కమల ఆయన ఛాంబర్‌ ముందు ‘సత్యాగ్రహం’ చేసి కొన్ని నిబంధనలతో ప్రవేశం పొందింది. ఒక సంవత్సరం ప్రొబేషన్‌ పీరియడ్‌ తర్వాత పరిశోధన తనకు నచ్చాలని, పురుష పరిశోధకుల పనుల్లో ఎటువంటి జోక్యం చేసుకోరాదని నిబంధనలు పెట్టి సి.వి.రామన్‌ అనుమతినిచ్చారు.

‘రామన్‌ గొప్ప శాస్త్రవేత్తే కానీ, సంకుచిత మనస్తత్వం..’ అని కమల వ్యాఖ్యానించడం పరిశోధనల్లో స్త్రీ పరిస్థితికి అద్దం పడుతుంది.

స్టెమ్‌ రంగంలో తక్కువ..

స్టెమ్‌ రంగాల్లో మహిళలు తక్కువగా ఉండడానికి మరికొన్ని కారణాలను పరిశీలిద్దాం..

తక్కువ ప్రాతినిధ్యం వలన ఆయా రంగాల్లో మహిళలు నాయకులుగా ఉండడం అరుదుగా ఉంటోంది. దీంతో మార్గదర్శకత్వం, స్ఫూర్తిని ఇచ్చేవారు కరువైపోతున్నారు. ఇక వేతనాల విషయానికొస్తే ఎన్నో పరిశోధనా సంస్థలు పురుషుల కంటే మహిళలకు తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. ఈ వివక్ష నిరుత్సాహపూరిత వాతావరణాన్ని ఏర్పరచి ఆయా రంగాల్లోకి రావాలనుకునేవారి సంఖ్యను తగ్గించేస్తుంది.

పని, వ్యక్తిగత జీవితం మధ్య సమన్వయాన్ని సాధించడం కూడా మహిళలకు కత్తి మీద సాములాంటిది. వివాహం, సంతానం, సంసార జీవితం, పిల్లల పెంపకం, పరిశోధన.. వీటన్నింటికీ టైమ్‌ మేనేజ్‌ చేయడంలో కూడా ఎన్నో ఒడిదుడుకులుంటాయి. మధ్యలో కొన్నిరోజులు ప్రసూతి సెలవులు పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఇవి పరిశోధనకు తాత్కాలిక ఇబ్బందులు సృష్టిస్తాయి.

కొన్ని పరిశోధనా సంస్థల్లో పనివేళలు మహిళలకు అనుకూలంగా లేకపోవడం, లైంగిక వేధింపులు, అకారణంగా వివక్ష చూపడం, ఉద్యోగోన్నతిలో పురుషులకు ప్రాధాన్యతనివ్వడం.. ఇలా ఎన్నో కారణాలు మహిళలు స్టెమ్‌ రంగాల్లోకి అడుగుపెట్టి, స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి ప్రతిభను చాటుకునేందుకు అడ్డంకులవుతున్నాయి.

  • పురుషులతో పోల్చితే మహిళా శాస్త్రవేత్తలకు ఇచ్చే పరిశోధనా గ్రాంట్లు తక్కువ.
  • పరిశోధకులలో మహిళల వంతు 33 శాతం మాత్రమే.
  • జాతీయ సైన్స్‌ అకాడమీలలో 12 శాతం మాత్రమే మహిళలు.
  • ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ లాంటి ఆధునిక సాంకేతికతలలో మహిళలు 22 శాతం మాత్రమే.
  • నాల్గవ పారిశ్రామిక విప్లవంగా పిలవబడే ప్రస్తుత సాంకేతిక యుగంలో మహిళా ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు 28 శాతం. కంప్యూటర్‌, సమాచార రంగంలో 40 శాతం మంది ఉన్నారు.
  • అత్యున్నత సైన్స్‌ మ్యాగజైన్లలో కూడా మహిళల పరిశోధనా వ్యాసాలకు దక్కుతున్న ఆదరణ అంతంత మాత్రమే!
  • కెరియర్‌లో ప్రమోషన్ల విషయంలో కూడా మహిళా వివక్ష స్పష్టంగా ఉంది.

women and girls in science story

అధిగమిస్తూ.. అప్రతిహతంగా..

‘స్త్రీ అబల కాదు సబల’ అనే మాట వింటూ ఉంటాము. ఈ మాటను ఎందరో మహిళలు నిరూపించారు. స్టెమ్‌ రంగాల్లో కూడా ఇలాంటి సబలలు ఎందరో ఉన్నారు. వీరు తమ పరిశోధనలలో మానవాళికి మేలు చేయడమే కాక, ఎందరో బాలికలకు స్ఫూర్తిగా నిలిచి వారిని విజ్ఞానశాస్త్ర పరిశోధనవైపు ఆకర్షించారు. అలాంటి వారిలో ప్రముఖులైన కొందరు విదేశీ మహిళా శాస్త్రవేత్తలను గుర్తుచేసుకుందాం.

మొదటి నోబెల్‌ బహుమతి పొందిన మహిళా శాస్త్రవేత్త మేరీక్యూరి. జీవితాన్ని రేడియోథార్మిక పరిశోధనకు అంకితం చేసి, చివరకు ఆ రేడియో థార్మిక ప్రభావం వల్లనే మరణించారు. రేడియం, పొలోనియం మూలకాలను కనిపెట్టడమేగాక, రెండుసార్లు నోబుల్‌ బహుమతి పొంది, ప్రతి మహిళా శాస్త్రవేత్తకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.

బ్రిటీష్‌ జీవభౌతిక శాస్త్రవేత్త అయిన రోసాలిండ్‌ ఫ్రాంక్లిన్‌ డి.ఎన్‌.ఎ., ఆర్‌.ఎన్‌.ఎ, బొగ్గు, గ్రాఫైట్‌, వైరస్‌ల అణునిర్మాణాలపై పరిశోధించి, విలువైన విషయాలను లోకానికి చెప్పారు. డి.ఎన్‌.ఎ. యొక్క డబుల్‌ హెలిక్స్‌ నిర్మాణాన్ని కనుగొనడంలో తన పరిశోధనే ప్రముఖపాత్ర పోషించింది.

బ్రిటీష్‌ గణిత శాస్త్రవేత్త అడాలవ్‌లేస్‌ మొదటి కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌. ఛార్లెస్‌ బాబేజ్‌ కనిపెట్టిన తొలితరం కంప్యూటర్‌ను పనిచేయించేందుకు అవసరమైన ఆజ్ఞల వరుస (అల్గారిథమ్‌)ను తయారుచేసి, కంప్యూటర్‌ రంగంలో ఆద్యురాలిగా కీర్తించబడ్డారు.

జేన్‌ గుడాల్‌ అయితే టాంజానియాలోని చింపాంజీల ప్రవర్తనపై పరిశోధన చేసి, ప్రపంచమంతా విస్తుపోయే విషయాలను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఆమె పర్యావరణ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.

జంపింగ్‌ జీన్స్‌, జన్యువుల క్రమబద్దీకరణ కనుకొన్న బార్బరా మెక్‌క్లింటన్‌, పెన్సిలిన్‌, ఇన్సులిన్‌, బి12 విటమిన్ల అణునిర్మాణాలను విశదీకరించిన డోరతి హాడ్కిన్‌, 1983 సంవత్సరంలో ఛాలెంజర్‌ స్పేస్‌ షటిల్‌లో అంతరిక్షాన విహరించిన భౌతిక శాస్త్రవేత్త, మొదటి అమెరికన్‌ మహిళా శాలీరైడ్‌.. ఇలా ఎందరో మహిళలు తమ శక్తి సామర్థ్యాలను స్టెమ్‌ రంగాల్లో ప్రపంచానికి చాటి చెప్పారు.

ప్రభావితం చేసిన స్త్రీలు..

భారతీయ మహిళా శాస్త్రవేత్తలు కూడా తమ పరిశోధనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. అలాంటివారిలో కొందరిని జ్ఞప్తికి తెచ్చుకుందాం.. భారతీయ విశ్వవిద్యాలయం నుంచి మొట్టమొదటిగా సైన్స్‌లో డాక్టరేట్‌ పొందిన మహిళ ఆసిమా ఛటర్జీ. అల్కలాయిడ్లపై ఆమె విస్తృతమైన పరిశోధన చేశారు. ఫలితంగా మూర్ఛ, మలేరియా వ్యాధులకు మందుల తయారీలో కీలకమైన పాత్ర పోషించారు.

వ్యవసాయ రంగంలో.. ముఖ్యంగా వంగ, చెరకులపై పరిశోధించి, మొక్కల యొక్క పునరుత్పాదకత గురించిన వివరాలెన్నో తెలిపిన శాస్త్రవేత్త జానకీ అమ్మాళ్‌. ‘బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ ఏర్పాటులో తన పాత్ర ఎంతో కీలకమైనది. అమెరికా ప్రభుత్వం ఒక పువ్వుకు ఆమె పేరును పెట్టి, గౌరవించింది.

చంద్రయాన్‌ 3లో..

ఇస్రో సాధించిన ఎన్నో విజయాలలో మహిళా శాస్త్రవేత్తలు భాగస్వాములయ్యారు. ముఖ్యంగా ‘చంద్రయాన్‌-3’ ప్రాజెక్ట్‌లో రీతూ కరిధాల్‌ నుంచి కల్పనా కాళహస్తి వరకు ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు మేధోశ్రమ చేశారు. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన రంగం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తామేమీ తక్కువ కాదన్నట్టుగా చంద్రయాన్‌-2 ప్రయోగంలో పనిచేసిన మహిళలు, చంద్రయాన్‌-3లోనూ పనిచేశారు. ఈ ప్రాజెక్టులో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, ల్యాండర్‌, రోవర్లు రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తల కృషి ఉంది.

చంద్రయాన్‌-2 మిషన్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన రీతూ కరిథల్‌ను ‘రాకెట్‌ ఉమన్‌ ఆఫ్‌ ఇండియా’గా ఇస్రోలో అందరూ పిలుస్తున్నారు. మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ ప్రయోగంలోనూ ఆమె డిప్యూటీ ఆపరేషన్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈమె 2007లో మాజీ రాష్ట్రపతి, అణు పరీక్షల నిపుణులు డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌కలాం చేతులు మీదగా ఇస్రో యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు కూడా అందుకున్నారు. చంద్రయాన్‌-2 ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా పనిచేసిన ఎం. వనిత ఉపగ్రహాలు తయారు చేయడంలో దిట్ట. ఆమె డిజైన్‌ ఇంజినీర్‌గా శిక్షణ తీసుకుని చంద్రయాన్‌-2లో అత్యంత కీలకమైన శాస్త్రవేత్తగా ఎంతో గుర్తింపు పొందారు. ‘ఆస్ట్రనామికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ నుంచి 2006లో బెస్ట్‌ ఉమెన్‌ సైంటిస్టు అవార్డును అందుకున్నారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టులోనూ ఆమె కీలకపాత్ర పోషించారు.

ఇంకా ఇస్రో స్పేస్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా సీతా సోమసుందరం, అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఉన్న కల్పనా కాళహస్తి, వ్యాఖనం అందించిన సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ డిప్యూటీ మేనేజర్‌ మాధురి బాధ్యతలు నిర్వహించారు. ఇలా మొత్తం 54 మంది మహిళలు ఈ మిషన్‌లో సైంటిస్టులుగా, ఉద్యోగులు, సిబ్బందిగా వివిధ స్థాయిల్లో పనిచేసి, కీలకంగా నిలిచారు. భారత్‌కు గర్వకారణమైన ప్రాజెక్టును విజయవంతం చేశారు.

ఇక ‘ఐఐఎఫ్‌. అని పిలవబడే కృత్రిమ గర్భధారణ పద్ధతికి ఆద్యురాలు డాక్టర్‌ ఇందిరా హిందూజా. 1986లో మనదేశంలో మొదటి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ జన్మించడంలో ముఖ్యపాత్ర వహించిన వ్యక్తి డాక్టర్‌ ఇందిరా హిందూజా.

‘మిస్సైల్‌ ఉమన్‌ ఆఫ్‌ ఇండియా’గా కీర్తించబడిన టెస్సీ థామస్‌ డి.ఆర్‌.డి.ఎ.లో అగ్ని-4 మిస్సైల్‌ ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. బాలిస్టిక్‌ మిస్సైల్‌ను బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేసిన టెస్సీ థామస్‌ భారత రక్షణ రంగాన్ని శత్రు దుర్బేధ్యం చేయడానికి ఎంతో పాటుపడ్డారు. కేరళలోని ‘తుంబా’ రాకెట్‌ కేంద్రం దగ్గర్లోనే తన బాల్యం గడిచింది. రాకెట్‌ కేంద్రం ప్రభావం తను ‘సైన్స్‌’ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం అయ్యుండవచ్చు.

ఒక గగన్‌దీప్‌ కంగ్‌ అయితే రోటావైరస్‌, టైఫాయిడ్‌లపై పరిశోధించిన క్లినికల్‌ సైంటిస్ట్‌. ఈ వ్యాధులకు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో కూడా ఆమె చురుగ్గా పాల్గొన్నారు.

women and girls in science story

వర్తమానంలో స్త్రీ పరిశోధనలు – అనువర్తనాలు.. 

  • జెన్నిఫర్‌ డౌడ్‌నా ఇమ్మానియల్‌ కార్పెంటియర్‌ కనుగొన్న క్రిస్పర్‌-కాస్‌ 9 అనే జన్యుసవరణ పద్ధతి వలన జెనెటిక్‌ ఇంజినీరింగ్‌, బయో టెక్నాలజీ, వైద్యరంగంలో అనూహ్య మార్పులకు బీజం పడింది.
  • కేటీభౌమన్‌ అనే శాస్త్రవేత్త ఇ.హెచ్‌.టి (ఈవెంట్‌ హారిజన్‌ టెలిస్కోప్‌) పనితీరును మెరుగుపరిచేందుకు తయారుచేసిన అల్గారిథమ్‌ (కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌) వలన, ఈ టెలిస్కోప్‌తో తొలిసారిగా విశ్వంలోని బ్లాక్‌ హోల్స్‌లో ఒకదాని చిత్రం తీయడం సాధ్యపడింది.
  • సుస్థిర రసాయన చర్యల్లో ఎంజైమ్‌ల పాత్రపై పరిశోధించిన ఫ్రాన్సిస్‌ ఆర్వాల్డ్‌ వాటిని ఉపయోగించి పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధిచేయడం, తత్ఫలితంగా పర్యావరణ అనుకూల రసాయన ప్రక్రియలు వెలుగు చూసేందుకు దోహదపడింది.
  • జీవ సంబంధ పదార్థాలు, కణజాల ఇంజినీరింగ్‌లో కృషి చేసిన సంగీతభాటియా క్యాన్సర్‌ గుర్తింపు, చికిత్సలలో విప్లవాత్మక మార్పులకు ఆద్యురాలిగా నిలిచింది.
  • ఫియానా వాట్‌ కూడా మూలకణ జీవశాస్త్రం, కణజాల పునర్నిర్మాణ పరిశోధనలు చేసి, గాయాలకు, చర్మ క్యాన్సర్‌కు చికిత్సలను సూచించింది.
  • ఇక మిషెల్లీ సిమన్స్‌ అయితే భవిష్యత్‌ కంప్యూటింగ్‌గా భావించబడుతోన్న క్వాంటమ్‌ కంప్యూటింగ్‌పై విస్తృత పరిశోధనలు చేస్తోంది.

ఇప్పటికైనా దృష్టి పెట్టారా?

ప్రపంచదేశాలు స్టెమ్‌ రంగాల్లో ఉన్న ఈ అసమానతలపై దృష్టి సారించాయా? ఎటువంటి చర్యలు తీసుకున్నాయి? అని ప్రశ్నించుకుంటే.. కొన్ని దేశాలు నిబద్ధతతో స్టెమ్‌ రంగాల్లో స్త్రీ-పురుష సమాన నిష్పత్తి కొరకు కృషి చేస్తున్నాయి.

ప్రసూతి సెలవులు, అనుకూలమైన పని సమయాన్ని ఏర్పరచడమేగాక, లింగ వివక్ష లేని విద్యా విధానాన్ని స్వీడన్‌, ఫిన్‌లాండ్‌ అనుసరిస్తున్నాయి. ఇక నార్వే అయితే సైన్‌ అకాడమీల పాలకమండళ్ళలో స్త్రీ-పురుష నిష్పత్తి సమంగా ఉండేలా చూస్తోంది. విద్యార్జన సమయంలోనే సైన్స్‌ రంగాల్లో బాలికలు ప్రవేశించేందుకు ప్రోత్సాహకంగా ఉపకార వేతనాలు, మార్గదర్శక వ్యవస్థను ఆస్ట్రేలియా ఏర్పాటు చేసుకుంది.

ఇక మనదేశం విషయానికొస్తే ‘భేటీ బచావ్‌-భేటీ పడావ్‌, ప్రగతి, సాక్ష్యం, ఉడాన్‌, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌, నైపుణ్య శిక్షణ, పరిశోధనా ప్రోత్సాహకాలు.. ఇలాంటి పథకాలన్నింటిలోనూ లింగ వివక్ష రూపుమాపాలని, స్టెమ్‌ రంగాల్లో బాలబాలికల నిష్పత్తి సమంగా ఉండాలని నిర్దేశించుకోవడం సముచితమే! అయితే క్షేత్ర స్థాయిలో బాలికలు ఈ రంగాల్లోకి అడుగు పెట్టేందుకు ఉన్న అడ్డంకులను తొలగించడంలో ఏమాత్రం పురోగతి లేదనేది వాస్తవం.

దేశంలోని ఎన్నో ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికీ ప్రయోగశాలలు లేవు. ఇంటర్‌ విద్య బోధిస్తోన్న కాలేజీలు ప్రాక్టికల్‌ పరీక్షల కొరకు మాత్రమే అరకొరగా విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు బాలికలకు ఏమాత్రం ప్రోత్సాహాన్ని ఇవ్వవు. పాఠశాల విద్య నేర్చుకునే సమయంలో ప్రయోగాలు, కృత్యాలు చేయని విద్యార్థికి పరిశోధన పట్ల ఆసక్తి ఎలా కలుగుతుంది?

చివరగా ఒక మాటను బలంగా నమ్మవచ్చు.”ప్రపంచానికి విజ్ఞానశాస్త్రం అవసరం.. విజ్ఞాన శాస్త్రానికి మహిళలు అవసరం..”

➡️