ECO: హింసకు తావు లేకుండా.. రీపోల్‌ అవసరమే రాకుండా 

  • సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఇవే ప్రధానం 
  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :  హింసకు తావు లేకుండా..ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా (జీరో వయలెన్స్‌..నో రీపోల్‌), పూర్తి స్వేచ్ఛగా, సజావుగా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా చెప్పారు. ఇదే లక్ష్యంతో కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్‌ సూపరింటెండెట్లు, కమిషనర్లతో సచివాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని, పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పోస్టల్‌ ద్వారానే బట్వాడా చేయాలని, పాడేరు ప్రాంతం మినహా మరే ఇతర ప్రాంతాల్లో మాన్యువల్‌గా పంపిణీ చేయడానికి వీలులేదని తెలిపారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలు పార్టీలు నగదు, బహుమతులను విరివిగా పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. వీటిపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత నివేదికలు వెంటనే పంపించాలని ఆదేశించారు.

వేగవంతంగా ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ
త్వరలో ఎన్నికల షెడ్యూలు ప్రకటించనున్న నేపథ్యంలో పెండింగ్‌ ఫార్ములా పరిష్కారం, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీని వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ముఖేష్‌కుమార్‌ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు కచ్ఛితమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల ఎస్‌సిలతోనూ ఆయన సమీక్ష జరిపారు. సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌ ఏరియాల్లో పోలీసు సిబ్బందిని నియమించాలని, ఎంతమంది కావాలో ముందే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. చిన్నచిన్న ఘటనలను కూడా ఉపేక్షించవద్దని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర పోలీస్‌శాఖ ఏర్పాట్ల గురించి అదనపు డిజిపి శంక్బ్రత్‌ బాగ్చీ పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో అదనపు సిఇఒ ఎమ్‌ఎన్‌ హరెంధిర ప్రసాద్‌, డిప్యూటీ సిఇఒలు కె విశ్వేశ్వరరావు, ఎస్‌ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️