సొరంగం కూలడానికి బాధ్యులెవరు ?

Nov 29,2023 11:31 #collapsed, #responsible, #Tunnel

డెహ్రాడూన్‌ : నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడానికి బాధ్యులెవరో గుర్తించి, శిక్షించాలని గబ్బర్‌ సింగ్‌ నేగి సోదరుడు మహరాజ్‌ సింగ్‌ న్యూస్‌ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో డిమాండ్‌ చేశారు. తన సోదరుడితోపాటు 41 మంది కార్మికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసిన సంస్థను శిక్షించాలని ఆతను కోరాడు. సహాయక బృందాల కృషి ఫలితంగా 17 రోజుల తరువాత సొరంగం నుంచి కార్మికులు బయటకు రావడంపై సంబరాలు చేసుకుంటుండడం గురించి మీడియాలోని ఒక సెక్షన్‌ మంగళవారం రాత్రి ఆదే పనిగా ఊదరగొట్టడం ద్వారా ఒక తీవ్రమైన తప్పిదాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది. హిమాలయాల నడిబొడ్డున విపత్తుకు కారణమైన ‘చార్ధామ్‌ ప్రాజెక్ట్‌’ ఆగిపోతుందా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ‘మోడీ హై తో ముమ్కిన్‌ హై’ నినాదాలు, సిల్కియారా వద్ద సొరంగం ముఖ ద్వారం వద్ద బాణాసంచా కాల్చుతూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్న దృశ్యాలకు ఇచ్చిన ప్రాధాన్యతలో నూరవ వంతు కూడా ,తీర్థయాత్ర టూరిజం పేరుతో పర్యావరణ నిబంధనలకు కాలరాస్తున్న అంశంపై పెట్టకపోవడం మీద విమర్శలొస్తున్నాయి. ఈ అంశాన్ని దేశంలోని పర్యావరణవేత్తలు, జియాలజిస్టులు, నిపుణులు లేవనెత్తారు. సొరంగం పక్కనే చిన్నపాటి మట్టి కొండ కనిపించింది. వర్షంలో ఎప్పుడైనా కొండచరియలు విరిగిపడవచ్చు. ఇది నదీజలాలతో కలసి దిగువ ప్రాంతాలకు చేరుకుని ఉత్తరాఖండ్‌ ప్రాంతాలలో విపత్తును కలిగిస్తుంది. మట్టిని కోస్తే కాపలా గోడతో అడ్డుకట్ట వేయాలని జియాలజిస్టులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో ఇళ్లు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతున్నాయి, పగుళ్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో చార్‌ధామ్‌ ప్రాజెక్ట్‌ పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉందా అనే సందేహాలు తలెత్తడం సహజమే. కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతత్వంలోని బిజెపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 2016లో రూ.800 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. హిమాలయాలలోని ఈ భాగంలోని పునాది భౌగోళికంగా పెళుసుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. తత్ఫలితంగా, అటువంటి సున్నపు రాతి రాళ్లలో పేరుకుపోయిన నేల-నీటి మిశ్రమం యొక్క స్వభావాన్ని ముందుగానే అంచనా వేయడం చాలా కష్టం. చాలా మంది అభిప్రాయం ప్రకారం, ఇటువంటి నిర్లక్ష్యపు ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఇందులో మొదటి ముద్దాయి. సొరంగ నిర్మాణంతో ప్రమేయం ఉన్న నిర్మాణ సంస్థల అధినేతలను శిక్షించాలని ఇరుక్కుపోయిన కార్మికుల కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 41 మంది కార్మికుల ప్రాణాలకు ముప్పు కలిగించడానికి బాధ్యులెవరో దర్యాప్తు చేసే అవకాశం చాలా తక్కువగా ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే అలా చేస్తే దేశ ప్రభుత్వం, ప్రధాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. లేకుంటే మరెన్నో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.

➡️