మరాఠా వీరులెవరో..?

  • మహారాష్ట్రలో 2 కూటముల మధ్య ప్రధాన పోటీ
  • కాంగ్రెస్‌- వికాస్‌ అఘాడీ
  •  బిజెపి- మహాయుతి

ఐదు దశల సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న మహారాష్ట్ర దేశంలో రెండో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం. పెద్దపెద్ద భవంతులతో ఉన్న ముంబాయి నగరం ఒకపక్క, ఆదివాసీ ప్రాంతమైన నాసిక్‌ మరోపక్క ఉన్న మరాఠా సీమ వైవిధ్యభరితంగా ఉంటుంది. ఇలాంటి రాష్ట్రంలో బిజెపి ఇతర పార్టీల నేతలను కేసులతో భయపెట్టి, ఆయా పార్టీలను చీల్చి రాజకీయ పబ్బం గడుపుకుంటోంది. శివసేన, ఎన్‌సిపిలో చీలకలతో లోక్‌సభ ఎన్నికల్లో లాభపడాలని బిజెపి చూస్తోంది. చీలికల వల్ల నెకొన్న సానుభూతి, బిజెపిపై ప్రజా వ్యతిరేకత ఎజెండాతో కాంగ్రెస్‌, ఎన్‌సిపి, శివసేన కూటమి పని చేస్తున్నాయి.

ఐదేళ్ల మూడు సంకీర్ణాలు ప్రభుత్వాలు
2019 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత బిజెపితో శివసేన తెగతెంపులు చేసుకుంది. ఇది మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి దారితీసింది. శివసేన ప్రత్యర్థులైన ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో చర్చలు జరుపుతుండగా, మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఎన్‌సిపి నేత అజిత్‌ పవార్‌ 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొంటూ బిజెపి-ఎన్‌సిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మద్దతు లేకపోయేసరికి మూడు రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో ఎన్‌సిపి, కాంగ్రెస్‌ మద్దతుతో శివసేన నేత ఉద్దవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. 2019 నుంచి రాష్ట్రంలో మూడుసార్లు అధికారం చేతులు మారింది. శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటు చేసి, శివసేనను రెండుగా చీల్చి, మహా అఘాడి ప్రభుత్వాన్ని మైనారిటీకి తగ్గించారు. ఏక్‌నాథ్‌ షిండేను ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకు బిజెపి మద్దతిచ్చింది. 2023లో అజిత్‌ పవార్‌ బిజెపి-శినసేన (షిండే) ప్రభుత్వంలో చేరడానికి మామ శరద్‌ పవార్‌తో సంబంధాలను తెంచుకుని, ఎన్‌సిపిని రెండుగా చీల్చారు. శివసేన, ఎన్‌సిపి చీలిక గ్రూపులను ఎన్నికల సంఘం (ఇసి) గుర్తించడంతో, ఎన్‌సిపి వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌ వర్గం తనను తాను ఎన్‌సిపి అని పిలుచుకుంది. శరద్‌ పవార్‌ ఎన్నికలలో ‘మ్యాన్‌ ఊదుతున్న తుర్హా (ట్రంపెట్‌)’ గుర్తును కలిగి ఉంది. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని దాని ప్రత్యర్థి వర్గం ఎన్‌సిపి పేరు, ‘గడియారం’ గుర్తును దక్కించుకుంది. ప్రచారంలో శరద్‌ పవార్‌ ఫోటో లేదా పేరును ఉపయోగించవద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. శివసేనలోని ఏక్‌నాథ్‌ షిండే గ్రూపు విల్లు, బాణం గుర్తును, ‘శివసేన’ పేరును దక్కించుకుంది. ఉద్ధవ్‌ ఠాక్రే తన వర్గాన్ని శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ థాకరే) అని పిలుస్తూ ‘మశాల్‌’ (అగ్ని మంట)ను పార్టీ ఎన్నికల గుర్తుగా ఎంచుకున్నారు.

పార్టీలు…సీట్లు
మహాయుతి కూటమిలో బిజెపి, శివసేన (షిండే), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(అజిత్‌ పవార్‌) పార్టీలు ఉన్నాయి. మహా వికాస్‌ అఘాడి కూటమిలో కాంగ్రెస్‌, శివసేన (ఠాక్రే), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (శరద్‌ పవార్‌) ఉన్నాయి. ఈ రెండు ప్రధాన కూటముల మధ్య గట్టి పోటీ ఉంటుంది. సంకీర్ణ భాగస్వాముల మధ్య అంతర్గత విభేదాలు, సీట్ల సర్దుబాట్లు బిజెపి కూటమికి తలనొప్పిగా ఉన్నాయి. మహాయుతి కూటమికి 37 మంది లోక్‌సభ ఎంపిలు ఉండగా, మహా వికాస్‌ అఘాడీకి ఎనిమిది మంది ఎంపిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా ఫోరంలో భాగంగా శివసేన (ఉద్దవ్‌) 21, కాంగ్రెస్‌ 17, ఎన్‌సిపి 10 స్థానాల్లో పోటీకి అవగాహన కుదిరింది. ఎన్‌డిఎ కూటమిలో బిజెపి 31, శివసేనకు 13, అజిత్‌ పవార్‌ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బిజెపి పాత మిత్రపక్షం – రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథవాలే) ఎన్‌డిఎ కూటమి కింద ఎటువంటి సీట్లు కేటాయించలేదు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ ఠాక్రే ఎన్‌డిఎకి మద్దతు ఇచ్చారు.

బారామతిలో ఒకే కుటుంబం మధ్య పోటీ
మహారాష్ట్రలో ఎన్‌సిపి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. ఇక్కడ నుంచి ఇండియా ఫోరం తరఫున శరద్‌ పవార్‌ కుమార్తె, సిట్టింగ్‌ ఎంపి సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు. బిజెపి కూటమిలో భాగంగా అజిత్‌ పవార్‌ (ఎన్‌సిపి) భార్య సునేత్రను బరిలోకి దిగారు. దీంతో బారామతిపై సర్వత్రా చర్చ నెలకొంది.

‘హింగోలి’లో సిపిఎం పోటీ
మహారాష్ట్రలోని హింగోలి లోక్‌సభ స్థానంలో సిపిఎం పోటీ చేస్తోంది. సిపిఎం తరపున విజరు రామ్‌జీ గభానే పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు. నాందేడ్‌ జిల్లాకు చెందిన సిఐటియు నాయకుడు. ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల, మతతత్వ, నిరంకుశ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పాలనపై సిపిఎం ప్రచారం ఎక్కుపెట్టింది. బిజెపిని చిత్తుగా ఓడించాలని, సిపిఎం విజయానికి పిలుపునిచ్చింది. దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో కనీసం ఒక లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ ఆదేశానుసారం, మహారాష్ట్రలోని పార్టీ హింగోలి లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తోందని పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ ధావలే తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన 47 లోక్‌సభ స్థానాల్లో బిజెపి, దాని మిత్రపక్షాల ఓటమికి, మహా వికాస్‌ అఘాది అభ్యర్థుల గెలుపు కోసం సిపిఎం కృషి చేస్తుందని అన్నారు.

రైతు సమస్యలే ఎజెండా
మహారాష్ట్రలో రైతుల అంశమే ప్రధాన సమస్య. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. మరఠ్వాడా ప్రాంతంలోని నాందేడ్‌, హింగోలి, విదర్భ, నాసిక్‌ జిల్లాల్లో పంటలకు గిట్టుబాటు ధర, విద్యుత్‌ తో పాటు అనేక సమస్యలపై పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించారు. ‘మహా’ రైతుల ఉద్యమం దేశాన్నే ఆకర్షించింది. ఆదివాసీ హక్కులు, నిరుద్యోగం, ధరలు పెరుగుదల ప్రధాన సమస్యలు ఎన్నికల్లో చర్చకు రాబోతున్నాయి. మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

– జె.జగదీష్‌

➡️